కరోనాపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. సభలో చర్చకు సంబంధించిన అంశంపైనే మాట్లాడాలని డిప్యూటీ ఛైర్మన్ పదేపదే చెబుతున్నా.. ప్రతిసారీ న్యాయవ్యవస్థ ప్రస్తావన తీసుకురావడంతో ఒక సమయంలో ఆయన గట్టిగా ఆదేశించాల్సి వచ్చింది. కరోనా మహమ్మారిపై కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చేసిన ప్రకటనపై రాజ్యసభలో గురువారం చర్చ జరిగింది. ఇందులో విజయసాయిరెడ్డి ప్రసంగం.. గందరగోళానికి తెర తీసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రులతో ప్రధాని క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. మూడు కోట్ల జనాభా దాటిన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే అత్యధిక నిర్ధరణ పరీక్షలతో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉందన్నారు.
రాజ్యసభ: న్యాయవ్యవస్థపై విజయసాయి వ్యాఖ్యల తొలగింపు - రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల తొలగింపు
కరోనాపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మాట్లాడిన విజయసాయి... అనంతరం ఆర్థిక సంక్షోభంతో పాటు న్యాయవ్యవస్థపై మాట్లాడారు. ఈ క్రమంలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన ప్రసంగానికి అడ్డు తగిలారు. విజయసాయి వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని డిప్యూటీ ఛైర్మన్‌ను కోరారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక సంక్షోభమే కాదు అంటూ న్యాయవ్యవస్థపై మాట్లాడటం ప్రారంభించారు. దీంతో చర్చకు, ఆ అంశానికి సంబంధం లేదంటూ తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాజీ అడ్వకేట్ జనరల్, తదితరులపై కేసులు నమోదు చేశారని, అసాధారణ కేసుల దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చిందని సాయిరెడ్డి చెబుతుండగా చర్చకు సంబంధించిన అంశంపైనే మాట్లాడాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ ఛైర్మన్ వారించారు. అయినా సాయిరెడ్డి కొనసాగించడంతో మరోసారి డిప్యూటీ ఛైర్మన్ వారించారు. ప్రభుత్వంపై రాజకీయ ప్రతీకార ఆరోపణలు చేస్తున్నారని సాయిరెడ్డి అనడంతో.. డిప్యూటీ ఛైర్మన్ చర్చకు సంబంధించిన అంశంపైనే మాట్లాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగులకు అద్భుతమైన చికిత్స అందిస్తోందని అంటూనే.. మరోసారి న్యాయవ్యవస్థను ప్రస్తావించడంతో ప్రసంగం పూర్తిచేయాలని డిప్యూటీ ఛైర్మన్ ఆదేశించారు. దీంతో విజయసాయిరెడ్డి ప్రసంగం పూర్తిచేశారు. తెదేపా ఎంపీ కనకమేడల సూచన మేరకు.. విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తూ డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి:ఇంటర్ సిలబస్ 30 శాతం తగ్గింపునకు తెలంగాణ సర్కారు ఆమోదం