Rajya Sabha Elections: రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరి పదవీకాలం వచ్చే నెలలో పూర్తికానుంది. తెరాస సభ్యులుగా పెద్దలసభకు ఎన్నికైన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్ 21తో ముగియనుంది. ఆ రెండు స్థానాలతోపాటు రాష్ట్రానికి సంబంధించి మరో రాజ్యసభ సీటు కూడా ఖాళీ అయింది. రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బండ ప్రకాశ్‌ను... శాసనమండలికి ఎంపిక చేయడంతో ఆయన ఎంపీ సీటును వదులుకోవాల్సి వచ్చింది. 2021 డిసెంబర్ 4న ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా... అప్పట్నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది.
70కిపైగా స్థానాలు: దేశవ్యాప్తంగా 70కిపైగా స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరి సభ్యుల పదవీకాలం పూర్తి కాగా... మరికొందరిది జూన్, జూలైలో ముగియనుంది. జులైలో రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా... ఈలోగా ఎలక్టోరల్ కాలేజీలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ గడువులోగా రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఏ కారణంగానైనా ఖాళీలు ఏర్పడితే వాటికి కూడా ఉపఎన్నికలు నిర్వహించనుంది.
ఈసీ షెడ్యూల్: ఇప్పటికే మూడు రాష్ట్రాల్లోని శాసనసభ స్థానాల ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అదే తరహాలో రాజ్యసభ ఎన్నికల నిర్వహణకూ త్వరలోనే షెడ్యూల్ వెలువరించనుంది. ద్వైవార్షిక ఎన్నికకు, ఉపఎన్నికకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇస్తారు. ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా ఎన్నికయ్యే ఇద్దరు సభ్యులకు ఆరేళ్ల కాలపరిమితి ఉండనుండగా... ఉపఎన్నికలో ఎంపికయ్యే సభ్యునికి కాలపరిమితి రెండేళ్ల పాటు ఉంటుంది.