కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అనంతగిరి రిజర్వాయర్ భూసేకరణ వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణభాస్కర్, అప్పటి జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా (ప్రస్తుతం వనపర్తి జిల్లా కలెక్టర్), భూసేకరణ అధికారి ఎన్.శ్రీనివాసరావులకు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 11 మంది పిటిషనర్లకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామానికి చెందిన వి.ముత్తారెడ్డి, మరో 10 మంది రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.
ఇదీ వివాదం
అనంతగిరి రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 69.22 ఎకరాలు, 257.37 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2017లో ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టలేదని, గ్రామసభలను నిర్వహించలేదని, అభ్యంతరాలను స్వీకరించలేదంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు పునరావాసం ప్యాకేజీ కల్పించేదాకా భూములను స్వాధీనం చేసుకోరాదని, వాటిని ముంపునకు గురి చేయరాదంటూ 2018 అక్టోబరులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండా భూములను 2019లో ముంపునకు గురి చేయడంతో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. చట్టప్రకారం పునరావాస అవార్డు ప్రకటించామని ప్రభుత్వం తెలిపింది.