Raj Bhavan Clarity on Pending Bills Issue : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెండింగ్ బిల్లుల వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై రాజ్‌భవన్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో లేవని వివరించింది. గతంలోనే 3 బిల్లులను గవర్నర్ ఆమోదించారని.. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారని తెలిపింది. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారని రాజ్‌భవన్ స్పష్టం చేసింది. ఇటీవల ప్రధాని మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా బిల్లులు పెండింగ్‌లో పెట్టిన గవర్నర్‌కు మోదీ ఓ మాట చెబితే బాగుండేదని కేటీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. రాజ్‌భవన్ పైవిధంగా స్పందించింది.
గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు. గతంలోనే 3 బిల్లులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. మరో 2 బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మిగిలిన బిల్లులపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. - రాజ్‌భవన్
అసలు కేటీఆర్ ఏమన్నారంటే..:వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. 9 ఏళ్ల పాలనలో యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రజలకు వివరించి ఉంటే ఎంతో బాగుండేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్ర ప్రజల 45 ఏళ్ల కల అని.. దానిని ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. రూ.20 వేల కోట్లతో గుజరాత్‌కు లోకో మోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చి.. తెలంగాణలో మాత్రం రూ.520 కోట్లతో రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీ అన్న కేటీఆర్.. కేంద్రం పరిధిలో ఉన్న 16 లక్షల ఖాళీలను భర్తీ చేయలేదని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తమపై నిందలు వేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీని అడ్డుకుంటున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రధాని మోదీ ఒక మాట చెబితే బాగుండేదని కేటీఆర్ విమర్శించారు. ఈ విమర్శలపైనే రాజ్ భవన్ స్పందించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి..
గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల కేసు.. సుప్రీం ఏం చెప్పిందంటే?
3 పెండింగ్ బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం.. మిగతావి..!