విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందేహాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు నివృత్తి చేశారు. తన కార్యాలయంలో మొదట అధికారులతో సమావేశమైన మంత్రి సబిత.. సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్ చేరుకున్నారు. మంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఉన్నారు. ఉమ్మడి నియామక బోర్డుకు సంబంధించి తనకు ఉన్న సందేహాలను గవర్నర్ వారి ముందు ఉంచారు. యూజీసీ విధివిధానాలకు లోబడే జరుగుతాయా, న్యాయ పరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం.. రిజర్వేషన్లు తదితర అంశాలను తమిళిసై ప్రస్తావించారు. యూజీసీ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తున్నామని, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు.. గవర్నర్‌కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు వివరించారు. ప్రస్తుత నియామక విధానంలోని ఇబ్బందులు కొత్త విధానం ద్వారా వచ్చే సౌలభ్యాన్ని వారు గవర్నర్‌కు చెప్పారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నియామక బోర్డు ద్వారా నియామకాల్లో పారదర్శకత ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు. పక్షపాతం లేకుండా అర్హతల ప్రకారం త్వరగా జరగాలని సూచించారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు జరగాలన్న తమిళిసై.. రాష్ట్ర యువత ఆశలకు అనుగుణంగా నియామకాలు జరగాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని.. వసతి గృహాలు, ల్యాబ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. లైబ్రరీ సౌకర్యాలు, డిజిటల్ వసతి మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. వర్సిటీల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యం పెంచాలని చెప్పారు.