తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో వర్షాలు.. జలకళ సంతరించుకున్న చెరువులు - Stopped traffic to several villages

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. అక్కడక్కడా వాగులు, వంకలు పొంగిపొర్లగా రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. చెరువులు మత్తడి పోస్తూ జలకళ సంతరించుకున్నాయి.

Rains in the state Puddle feeding ponds
రాష్ట్రంలో వర్షాలు.. జలకళ సంతరించుకున్న చెరువులు

By

Published : Aug 10, 2020, 10:25 PM IST

హైదరాబాద్‌లోని పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, సైఫాబాద్, లక్డీకపూల్, బషీర్‌బాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో పడిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు.. కార్యాలయాలకు వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు.

రాష్ట్రంలో వర్షాలు.. జలకళ సంతరించుకున్న చెరువులు

ఉమ్మడి వరంగల్​లో జలకళ

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌లో.. గత అర్థరాత్రి నుంచి తేలికపాటి వర్షం పడింది. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. కరీమాబాద్‌ ఉర్సు చెరువు మత్తడి పోయగా... ఖిలా వరంగల్‌ రాతి కోట దిగువన ఉన్న అగర్తల కుంట పూర్తిగా నిండింది. రహదారిని కోస్తూ రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. మధురానగర్‌, శాకరాసికుంట, లక్ష్మీగణపతి కాలనీ, వీవర్స్‌ కాలనీల్లోకి వరద నీరు రావడం వల్ల జనం ఇబ్బంది పడ్డారు. వరంగల్‌ నగర పాలక సంస్థ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

పొంగిన వాగులు

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, గార్ల మండలాల్లో భారీ వర్షం పడింది. మహబూబాబాద్‌ మండలంలో ఓ మోస్తారు వాన పడింది. జిల్లాలోని మున్నేరు, ఆకేరు, వట్టివాగు, పాలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ఘన్‌పూర్, రేగొండ, కాటారం, మహదేవ్‌పూర్, చిట్యాల తదితర ప్రాంతాల్లో నాలుగైదు సెంటీమీటర్ల వర్షం పడింది. సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలోనూ పలుచోట్ల నాలుగు నుంచి ఏడు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి వెంకటాపురం మండలం పాలెంవాగు మధ్యతరహా జలశయానికి భారీగా వరద రాగా నాలుగు గేట్లు ఎత్తి గోదావరికి మళ్లించారు.

అలుగు పోస్తున్న చెరువులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీలో ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు జలకళతో అలుగు పోస్తున్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో మల్లన్నవాగు, కిన్నెరసాని వాగు పొంగుతుండగా.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందు మండలంలో ఇల్లందులపాడు చెరువు, లలితాపురం చెరువులు అలుగు పోస్తూ కనువిందు చేస్తున్నాయి.

మత్తడి దూకుతున్న చెరువులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, పరిసర గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని మూలవాగుకు భారీ వరద చేరగా... మధ్య మానేరుకు పెద్ద మొత్తంలో నీరు వెళ్తోంది. గ్రామీణ మండలంలోని హనుమాజీపేట వద్ద నక్కవాగు పొంగి పొర్లుతోంది.

నిజామాబాద్​లో మురుగు వరద

నిజామాబాద్‌లో ఎల్లయ్య చెరువులోకి మురుగుతో కూడిన వరద నీరు చేరింది. మత్తడి దూకుతున్న కాలుష్యపు నీరు నురగలు గక్కుతోంది. పొలాల్లోకి నురుగు చేరి... తెగుళ్లు సోకుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఎరుగట్ల మండలంలో ఏర్గట్ల వాగు నిండి అలుగు పారింది. కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల భీమేశ్వర స్వామి ఆలయం ముందు భీమేశ్వర వాగు పొంగి ప్రవహిస్తుంది.

ఇదీ చూడండి :నేటితో పూర్తైన సచివాలయ భవనాల కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details