తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం - Today Weather Report latest news

Rains In Telangana Toady: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మరోసారి జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో రహదారులు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాగల రెండు రోజులు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

By

Published : Sep 11, 2022, 3:37 PM IST

Updated : Sep 11, 2022, 9:39 PM IST

Rains In Telangana Toady: రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షానికి డిచ్​పల్లి, ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి, జక్రాన్ పల్లి ,మోపాల్ మండలంలో చెరువులు, కుంటలు మళ్లీ అలుగు పోస్తున్నాయి. గడుకోల్‌లోని కప్పుల వాగు లోలెవల్‌ పైవంతెన నుంచి ప్రవహిస్తోంది. బోధన్‌లోని వేంకటేశ్వర కాలనీ, సరస్వతినగర్‌లో రహదారులపై భారీగా నీరు చేరింది.

బోధన్‌ తపాలా కార్యాలయం మురుగు నీటితో నిండిపోయింది. నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది సాలూరు వద్ద లో లెవన్‌ వంతెనను తాకుతుంది. పులాంగ్ వాగులో ప్రవాహం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నిజామాబాద్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి నడిపల్లి శివారులో రోడ్డుపై వరద ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.

పలు జిల్లాలో ఎడతెరపిలేని వర్షం:సిరిసిల్ల జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది. వెంకంపేట, అశోక్​నగర్, సంజీవయ్యనగర్, శాంతినగర్, పాత బస్టాండ్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. కరీంనగర్ ప్రధాన రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వేములవాడ మండలం ఫాజుల్​నగర్ వాగులో కారు కొట్టుకు పోయి ఇద్దరు మృతి చెందారు.

వాగులో కారు కొట్టుకు పోయి ఇద్దరు మృతి:జగిత్యాలకు చెందన నలుగురు హైదరాబాద్‌ వెళ్తుండగా వాగు ఉద్ధృతిలో చిక్కుకుపోయారు. కారు మునిగిపోవటంతో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మెట్‌పల్లిలో లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు భారీగా చేరింది. కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇళ్లంతకుంట, కమలాపూర్ మండలాల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి.

జాతీయ రహదారిపై భారీ గుంత:వీణవంక మండలం నర్సింగాపూర్‌లో ఇంటిపై భారీ చెట్టు పడటంతో రేకుల షెడ్డు కూలిపోయింది. పెద్దపల్లి జిల్లా రంగంపల్లి రాజీవ్ రహదారిపై భారీగా వరద చేరింది. గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్లే మార్గంలో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని బతుకమ్మ వాగు సమీపంలో అప్రోచ్ రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. 63వ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సిరోంచ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇద్దరిని మింగేసిన భారీ వృక్షం:నిర్మల్‌లో రోడ్డుపై వెళ్తున్న టాటాఏస్‌ వాహనంపై భారీ వృక్షం పడి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకులు కుంటాల జలపాతం వద్దకు వెళ్తుండగా.. ఖానాపూర్‌ మండలం ఎగ్బాల్‌పూర్‌ సమీపంలోకి రాగానే వాహనంపై భారీ వృక్షం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భుచ్చన్న, రవి అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ పరిస్థితి విషమంగా ఉంది.

హనుమకొండలో జోరు వాన:హనుమకొండలో జోరు వాన పడింది. రహదారులు జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా మహముత్తారం, కాటారం, పలమెల మండలాల్లో వాగులు వంకలు ఉప్పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సింగారం సమీపంలో ఉన్న కొండని వాగు లోలెవల్ కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరదలో కారు చిక్కుకుంది.

అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక వాగులో వరద ఉద్ధృతికి టీవీఏస్ మోపెడ్ బైక్ కొట్టుకుపోయింది. వాహనంపై వెళ్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్రంలో మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

ఇవీ చదవండి:కుండపోత.. ప్రజల వెత.. నేడూ, రేపూ అదే పరిస్థితి..!

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌బరస్ట్‌.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు

Last Updated : Sep 11, 2022, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details