ప్రశ్న: వేసవి ముగింపు దశకు చేరింది. రాష్ట్రంలో ఈసారి పెద్దగా ఎండలు, వడగాడ్పులు లేకపోవడానికి కారణాలు..
జవాబు: వేసవిలో మార్చి నుంచే ఉత్తరాది, రాజస్థాన్, మధ్య భారత్ నుంచి వేడిగాలులు దక్షిణానికి వీస్తుంటాయి. ద్రోణులు ఏర్పడక వడగాడ్పులతో ఉష్ణోగ్రతలు మే నెలాఖరుకు మరింతగా పెరుగుతుంటాయి. ఈసారి తద్భిన్న పరిస్థితి.. దక్షిణాదితో పాటు బంగాళాఖాతం, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీచాయి. అవి వెంట తేమను తీసుకురావడంతో సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. వాటికి తోడు ఈదురుగాలులు ఉష్ణోగ్రతలను పెద్దగా పెరగకుండా చేశాయి. హైదరాబాద్‌లో రెండు మూడు రోజులే ఉష్ణోగ్రత 40 డిగ్రీలను తాకింది. రాష్ట్రంలో ఏప్రిల్ ఆఖరులో కొద్దిరోజులు వడగాడ్పులు వీచాయి. వచ్చే వారం రోజులు రాష్ట్రంలో 40 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండవచ్చు.
ప్రశ్న: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటే తర్వాత వర్షాలు బాగా పడతాయంటారు..ఈసారి అలా జరిగేనా?
జవాబు: అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమతో మేఘాలు ఏర్పడి తర్వాత మంచి వానలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా. ప్రస్తుత ఉష్ణోగ్రతలు సరిపోతాయి. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఒకేలా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నాం.