రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చాలాచోట్ల ఉరుముల, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, తూర్పు జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు.
రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు - రాష్ట్రంలో వర్షసూచన
రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం ఒడిశా నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుందని వివరించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలియజేశారు.
ఆదివారం అక్కడక్కడ స్వల్పంగా వర్షాలు కురిశాయి. మద్గుల్ చిట్టెంపల్లి (వికారాబాద్ జిల్లా)లో 14, పూడూరు (జగిత్యాల)లో 9.3, రుద్రంగి (సిరిసిల్ల)లో 5.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు కొనసాగే అవకాశాలున్నందున ధాన్యాన్ని బయట ఆరబోయవద్దని రైతులకు మార్కెటింగ్ శాఖ సూచించింది.