Rains In Telangana Toady: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. తాండూర్ కాగ్న నది, కోకట్ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగు ఉప్పొంగటంతో తాండూరు - ముద్దయిపేట్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధరూర్ మండలం నాగారం వద్ద ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. రహదారి దాటుతుండగా నీటిలో పడిపోయింది.
ప్రయాణికులు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. గమినించిన స్థానికులు నీటిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడారు. తాళ్ల సహాయంతో కారును బయటకు తీశారు. కొడంగల్‌లోని పెద్ద చెరువు కట్ట.. భారీగా కోతకు గురై బుంగ పడింది. చిన్న బుంగ కాస్తా చూస్తుండగానే ఇరువైపులా మట్టిని చీల్చుకుంటూ పెద్దదిగా మారింది. దీంతో దిగువన పంట పొలాల్లోకి భారీగా వరద పోటెత్తింది. పట్టణంలోని వివిధ కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
పరిగిలో కుండపోత వర్షం: పరిగి పట్టణంలో కుండపోత వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. రహదారులు జలమలమయ్యాయి. దోమ మండలం గొడుగోనిపల్లి అంచున ఉన్న పెద్ద వాగు నిండుకుండలా పొంగిపొర్లుతోంది. వాగు నుంచి సుమారు 100 మీటర్ల పొడవు వరకు పంట పొలాల్లో భారీ వరద ప్రవహిస్తోంది. పరిగి-మహబూబ్‌నగర్ మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. అల్లాపూర్ చెరువు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.