Rainfall in Telangana :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. హైదరాబాద్ శేరిలింగంపల్లి పరిధిలో రాత్రి కురిసిన వర్షానికి మియాపుర్, చందానగర్, మాదాపుర్ గచ్చిబౌలి రాయదుర్గం(Rayadurgam) ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నీట మునిగి.. గచ్చిబౌలి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Rain Alerts in Telangana : తెలంగాణలో రాగల మూడు రోజుల్లో వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
భాగ్యనగరంలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ.. పూర్తిగా నీట మునిగాయి. దీంతో రాత్రి వేళ ఇళ్లకు వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. రోడ్లపై నీళ్లు నిలిచి ఉండడంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియక సతమతమయ్యామని ద్విచక్రవాహనదారులు వాపోతున్నారు. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. కేసముద్రం మండలం అర్పణపల్లి వంతెన పైనుంచి వట్టివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కేసముద్రం, గూడూరు మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Weather Alert in Telangana :మెదక్ జిల్లాలో కురిసిన ఎడతెరిపి లేని వానలకు శివ్వంపేటలో చెరువు అలుగు పారుతోంది. ఏడేళ్ల తర్వాత పెద్దచెరువు నిండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురస్తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో అత్యధికంగా 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా నల్గొండ జిల్లాలోని కంగల్లో 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.