Rain with hail in Telangana : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ పడిన పిడుగులకు ముగ్గురు మృతి చెందగా వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం మిగిల్చింది. వడగళ్ల వానకు పలుచోట్ల రోడ్లు, పొలాలు తెల్లటి మంచు స్ఫటికాలతో నిండి కశ్మీర్‌ను తలపించాయి. అనేక ప్రాంతాల్లో రేకుల ఇళ్లకు చిల్లులు పడటంతో పాటు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు, వడగళ్లు, ఆదివారం వర్ష కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.
వర్షం పడడం వల్ల పంటలకు తీవ్ర నష్టం: హైదరాబాద్ నగరానికి నిత్యం కూరగాయలు సరఫరా చేసే సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పంటలు దెబ్బతిని అన్నదాతలకు అపార నష్టం మిగిలింది. సంగారెడ్డి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో ఉల్లి, 500 ఎకరాల్లో కూరగాయలు, 250 ఎకరాల్లో మామిడి, 50 ఎకరాల్లో బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో వడగళ్ల కారణంగా 10 మందికి పైగా విద్యార్థులు గాయాలపాలయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో మంచు రాయి 300 గ్రాముల నుంచి అరకిలో బరువు ఉండడంతో ఇళ్ల పైకప్పు రేకులు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వరి పంటలు, పుచ్చ, నిమ్మ, మిర్చి, బత్తాయి, నిమ్మ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.