తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​వాసులకు తప్పని వాన తిప్పలు

భారీ వర్షాలు హైదరాబాద్​ను ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు రావడం వల్ల ట్రాఫిక్​కు​ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగోల్​లో ఓ వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలిగింది. భారీ వరదతో హుస్సేన్​సాగర్​ నిండింది. అధికారులు కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు జీహెచ్​ఎంసీ సమీక్షిస్తోంది.

rain

By

Published : Sep 25, 2019, 6:18 PM IST

Updated : Sep 25, 2019, 7:33 PM IST

హైదరాబాద్​వాసులకు తప్పని వాన తిప్పలు

వర్షంతో హైదరాబాద్​ తడిసి ముద్దయింది. నగరంలోని రహదారులన్నీ జలమయంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరింది. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ట్రాఫిక్​ సమస్య పరిష్కారానికి సైబరాబాద్ కమిషనర్, జీహెచ్​ఎంసీ వెస్ట్​జోన్ కమిషనర్ హరిచందన క్షేత్ర స్థాయిలో పర్యటించారు.

ఇళ్లలోకి నీరు

బేగంపేటలోని పాట్నీనగర్​లో ఇళ్లల్లోకి వర్షపునీరు వచ్చి చేరింది. కుత్బుల్లాపూర్ మున్సిపల్ పరిధిలో దత్తాత్రేయనగర్​లో డ్రైనేజీలు పొంగి ఓ ఇంట్లోకి వర్షపు నీరు చేరింది. వర్షాల ధాటికి సికింద్రాబాద్ కంటోన్మెంట్​లోని రెండు ఇళ్లు కూలిపోయాయి. ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ప్రహరీ గోడ కూలింది. ఉప్పల్​లో లోతట్టు కాలనీలోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. చిలుకానగర్, స్వరూప్‌నగర్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, మేడిపల్లి, చిలుకానగర్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్ భోలక్​పూర్ డివిజన్​లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో వర్షపు నీరి చేరింది. రాత్రంతా విద్యార్థినిలు తీవ్ర అవస్థలు పడ్డారు.

నీటిలో కార్పొరేటర్​

హయత్​నగర్ డివిజన్ పరిధిలోని సుష్మసాయినగర్​లో గ్రీన్ మిడోస్ కాలనీలోకి వెళ్లే కమాన్ వద్ద భారీగా వరద నీరు నిలిచింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ అక్కడికి చేరుకుని వర్షపు నీటిలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడం వల్ల ఇలా నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. శామీర్​పేట మండలం బాబాగుడాలో కోళ్ల ఫారంలోకి నీరు చేరి ఐదువేల కోళ్లు మృతి చెందాయి.

హుస్సేన్​సాగర్‌లోకి భారీగా వరద

బంజారాహిల్స్​లోని సాగర్ సొసైటీ కాలనీలో చెట్టు విరిగి పడింది. జీహెచ్​ఎంసీ సిబ్బంది వచ్చి చెట్టును తొలగించారు. నాగోల్​లోని ఆదర్శనగర్​లో ప్రేమ్ కుమార్ శర్మ అనే వ్యక్తి నాలాలో పడి మృతి చెందాడు. తెల్లవారుజామున అతని మృతదేహాన్ని బయటకు తీశారు. హుస్సేన్​సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు ఎగువ ప్రాంతం నుంచి వర్షపునీరు భారీగా వస్తుండడం వల్ల అధికారులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. నగర పరిస్థితిని జీహెచ్​ఎంసీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

ఇదీ చూడండి : మహానగరంలో సీజన్​ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

Last Updated : Sep 25, 2019, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details