Rain Lashes In across Telangana: అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్,.. తంగళ్ళపల్లి ,బోయిన్‌పల్లి, గంగాధర, భీమారం, రామడుగు, మానకొండూరు, చొప్పదండి మండలాల్లో వడగండ్ల వాన దంచి కొట్టింది.
పెద్దపల్లి జిల్లాలోను పలుచోట్ల వర్షం పడింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంట, కమలాపూర్ భారీ వర్షం కురిసింది. వీణవంకలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కురు, ఆత్మకూరు, గుండాల మండలాలలో వడగండ్ల వాన బీభత్సంతో పంటలు దెబ్బతిన్నాయి. చేతికందొచ్చిన వరిపంట నేల వాలాయి. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో మామిడికాయలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
పలు జిల్లాలో వడగండ్ల వాన:కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడంగల్ మండలాల్లో బలమైన ఈదురు గాలులతో వడగండ్లు కురిశాయి. సుమారుగా గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం చక్రంపల్లిలో వడగండ్ల వాన కురిసింది. డిచ్పల్లి మండల పరిధిలోని ఉల్లి పంట దెబ్బతింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో.. జనగామ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా రేగొండ, చిట్యాల,టేకుమట్ల, మొగుల్లపల్లి మండలాల్లో.. నిర్మల్ జిల్లా భైంసా, కుబీర్, కుంటాల, ముథోల్, తానూర్ మండలాల్లో భారీ వర్షం పడింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ వర్షానికి రోడ్లపై నీళ్లు ప్రవహించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన యారం లక్ష్మిరెడ్డి చెందిన బొప్పాయి పంట దెబ్బతింది. ఆయన 30 ఎకరాల్లో మన్సింగ్ పద్ధతిలో బొప్పాయి సాగు చేస్తుండంగా.. అకాల వర్ష కారణంగా సుమారు పదెకరాల్లోని చెట్లు నేలకొరిగాయి. దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపారు. మరోవైపు కల్లాలో ఆరబెట్టిన మిరపకాయలు తడిచిపోవడంతో.. అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు