rain alert for telangana: ఈమధ్య కాలంలోనే అకాల వర్షాలు కర్షకుడిని కష్టాల పాలు చేసింది. కనివినీ ఎరుగని రీతిలో పంట నష్టం కలిగింది. ఇప్పుడు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులతో, వడగండ్లతో కూడిన వాన కురవనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పంటలకు నష్టం వాటిల్లి ఆర్థికంగా కుదేలైన రైతులకు ఇదొక పిడుగుపాటు వార్తే అవ్వనుంది.
రాష్ట్రంలో నేడు రేపు రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఇదే సమయంలో ఈశాన్య తెలంగాణలో ఉరుములు,మెరుపులతోపాటు గంటకు 30నుంచి 40కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షాలు పడుతాయని హెచ్చరించింది. రాయలసీమ పరిసర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని ఉపరితల ద్రోణి ఝార్ఖండ్ చత్తీస్ గఢ్, విదర్బ,తెలంగాణ రాష్ట్రం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వివరించింది.
ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురవడం వల్ల తెలంగాణలో ఎంతో పంట నష్టం కలిగింది. మొక్కజొన్న, మిర్చి, వరి పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది. పదిహేను రోజుల్లో పంట చేతికొస్తుంది అనే తరుణంలోనే అనుకోని అకాల వర్షాలు కురిసి రైతుకు కంట నీరు మిగిల్చింది. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తీవ్రంగా పంట నష్టం కలిగింది.