Union Minister Ashwini Vaishnav Interview : శతాబ్ది, రాజధాని కంటే ఆధునికమైన, వేగవంతమైన సెమీహైస్పీడ్ వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అతి త్వరలోనే మరిన్ని కేటాయిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సికింద్రాబాద్ స్టేషన్లో ఆదివారం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం అనంతరం అశ్వినీ వైష్ణవ్ ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
కొత్తగా బెర్తులతో కూడిన స్లీపర్ వందేభారత్, వందే మెట్రో రైలు డిజైన్ పూర్తయిందని, త్వరలో వాటి ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 35 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. త్వరలో వాటి పేర్లు ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించబోయే అతిపెద్ద బహుమతిగా దీనిని అభివర్ణించారు.
తెలుగు రాష్ట్రాలకు ఎన్ని వందేభారత్‌లు ఇచ్చే అవకాశం ఉంది?
అతి త్వరలోనే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, తిరుపతి, విజయవాడకు ఈ రైళ్లను ప్రారంభిస్తాం. మూడేళ్లలో 475 వందేభారత్‌లను ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. ఎనిమిది రైళ్లు పట్టాలెక్కాయి. తొలిదశలో దేశంలో 75 నగరాలను అనుసంధానించడం లక్ష్యం. సికింద్రాబాద్-విశాఖపట్నం రైలుతో 30 నగరాలు పూర్తయ్యాయి. ప్రతి 10 రోజులకు ఒకటి అందుబాటులోకి తెస్తున్నాం. తొమ్మిదో వందేభారత్‌ని ఈ నెల 23, 24 తేదీల్లో ప్రారంభిస్తాం. ఈ రైళ్ల జీవితకాలం 35 సంవత్సరాలు. మొదటి విడత పూర్తయ్యాక రెండో దఫాలో తెలుగు రాష్ట్రాలకు కొత్త వందేభారత్ రైళ్లు వస్తాయి. తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రధాన నగరాలను వీటితో అనుసంధానం చేస్తాం.
వందేభారత్ గరిష్ఠ వేగం 160-180 కి.మీ. ప్రస్తుత ట్రాక్‌ల సామర్థ్యం 110-130 కి.మీ. మాత్రమే కదా?
గతంలో రైలు పట్టాల సామర్థ్యం గంటకు 70 కి.మీ. మాత్రమే. గత ఎనిమిదేళ్లలో 110 కి.మీ.కు, కొన్నిచోట్ల 130 కి.మీ.కు పెంచాం.సికింద్రాబాద్-విజయవాడ సహా పలు మార్గాల్లో ట్రాక్ సామర్థ్యాన్ని ఏడాది, ఏడాదిన్నరలో 160 కి.మీ.కు పెంచబోతున్నాం.
ఛార్జీలు భారీగా ఉన్నాయి. సామాన్యులు ఈ రైళ్లలో ప్రయాణించగలరా?
ప్రయాణికులు ఇప్పుడు సమయానికి, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. త్వరగా గమ్యం చేరాలని, ప్రయాణంలో అనుభూతి పొందాలని కోరుకుంటున్నారు. అవన్నీ వందేభారత్‌లో ఉన్నాయి.
కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఈసారైనా కేటాయింపులు పెరిగే అవకాశం ఉందా?
రైల్వేపరంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి గతేడాది రూ.12 వేల కోట్లు కేటాయించాం. అతి పెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు ఇచ్చింది రూ.11 వేల కోట్లే.
తెలంగాణకు ఇచ్చింది రూ.3 వేల కోట్లే కదా?
2014కు ముందుతో పోలిస్తే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు చాలా రెట్లు పెంచాం. ఇంకా అధిక నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాజెక్టులకు భూసేకరణలో జాప్యంతో పాటు, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్రం సహకరించాలి.