ఈయన పేరు కిశోర్‌కుమార్. స్వస్థలం అనకాపల్లి. దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. వారానికి ఆరు రోజులు విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే కిశోర్... ఆదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక ఆశ్రమంలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల కేంద్రాల్లో కిశోర్ పేరు తెలియదంటే అతియోశక్తి కాదేమో. అంతలా వాటితో అనుబంధాన్ని పెంచుకున్న కిశోర్ కుమార్ మూడేళ్లుగా ప్రతి ఆదివారం వృద్ధులు, వికలాంగులు, అనాథల ఆకలి తీరుస్తూ వారి కడుపు నింపడంలోనే ఆనందాన్ని వెతుకుతున్నారు.
చిన్నప్పటి నుంచే సమాజ సేవ
కిశోర్‌కుమార్ పాఠశాల స్థాయి నుంచే సామాజిక సేవలో పాలు పంచుకుంటూ వచ్చారు. 1994లోనే మదర్‌థెరిసా వెల్ఫేర్ అసోసియేషన్, సూపర్ కిడ్స్ డ్యాన్స్ అండ్ కరాటే అసోసియేషన్లు స్థాపించి విశాఖ, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల పిల్లలు, అనాథలకు అండగా నిలిచేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను పోగు చేసి పిల్లలకు పుస్తకాలు, బట్టలు కొనిచ్చేవారు. కరాటే, డ్యాన్స్, స్విమ్మింగ్, స్కేటింగ్ నేర్పించగా... వచ్చే డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వెచ్చించేవారు. ఇలా పాతికేళ్ల వయసు వచ్చే వరకూ సామాజిక సేవలో కొనసాగుతూ వచ్చిని కిశోర్... రైల్వేలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన అభిరుచిని మార్చుకోలేదు. ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే ప్రతి ఆదివారం ఏదో ఓ ఆశ్రమంలో అభాగ్యుల ఆకలి తీరుస్తూ కనిపిస్తారు.
అభాగ్యులకు వైద్య సాయం కూడా...