తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు రూ.2420కోట్లు' - telangana varthalu

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణ ప్రాంతానికి రైల్వే ప్రాజెక్టుల విషయంలో రూ. 2420 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా కాజీపేట-బల్లార్షా, కాజీపేట-విజయవాడ మూడో లైనుతో పాటు మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం-సత్తుపల్లి, అక్కన్నపేట-మెదక్ లాంటి గతంలో మంజూరైన కొత్త రైలు మార్గాలకు కేటాయింపులు జరిగాయి. తెలంగాణలో చర్లపల్లి టర్మినల్ రూ. 50 కోట్లు... కాజీపేట పీఓహెచ్ వర్క్ షాప్​కు రూ.2 కోట్లను కేటాయించారు. ఆదిలాబాద్- ఆర్మూర్​తో సహా ఇతర కొత్త ప్రాజెక్టుల ఊసులేదు. ఎంఎంటీఎస్​కు నామమాత్రపు కేటాయింపులే జరిగాయి. ఆంధ్రప్రదేశ్​కు రైల్వేల విషయంలో రూ. 5812 కోట్లను కేటాయించగా... సరుకు రవాణా కారిడార్ కొత్తగా కేటాయించటం మాత్రం కొంత ఊరట కలిగించింది.

'రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు రూ.2420కోట్లు'
'రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు రూ.2420కోట్లు'

By

Published : Feb 4, 2021, 8:30 PM IST

కేంద్ర బడ్జెట్​లో రైల్వే ప్రాజెక్టుల వారిగా జరిగిన కేటాయింపు వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా నేడు వర్చువల్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తంగా 2420 కోట్ల రూపాయలు కేటాయించగా... ఆంధ్ర ప్రదేశ్​కు రూ.5812 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ విషయంలో గత ఆరు సంవత్సరాల కేటాయింపులతో సరాసరితో పోల్చితే 118 శాతం ఎక్కువని... ఆంధ్రప్రదేశ్ విషయంలో 105 శాతం ఎక్కువని జీఎం వెల్లడించారు. మొత్తగా దక్షిణ మధ్య రైల్వే విషయంలో రూ. 7222 కోట్ల కేటాయింపు జరిగింది. గత సంవత్సరం 7024 కోట్లు కేటాయింపు మాత్రమే జరిగింది. మూడో లైను, డబ్లింగ్, బైపాసు లైను పనుల కోసం రూ.4238 కోట్లు కేటాయించారు. కొత్త లైన్ల కోసం రూ.2195 కోట్లు, విద్యుదీకరణ కోసం రూ.617 కోట్లు, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి రూ.173 కోట్లు కేటాయించారు. మొత్తంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లెవెల్ క్రాసింగ్, బ్రిడ్జిలు, ఆర్వోబీ, ఆర్​యూబీ లాంటి వాటి కోసం, భద్రతకు సంబంధించి రూ.672 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.374 కోట్లు గోల్డెన్ క్వాడ్రిలేటరల్, గోల్డెన్ డయాగ్నల్ ఆర్వోబీ, ఆర్​యూబీల కోసం కేటాయించారు.

కొత్త మార్గాల విషయంలో కేటాయింపులు

రాష్ట్రంలో కొత్త మార్గాల విషయంలో కేటాయింపులను తీసుకున్నట్లయితే.... కొత్తపల్లి-మనోహరాబాద్ కోసం రూ.325 కోట్లు కేటాయించారు. దీనిని 2006-07లో రూ.151 కి.మీల వ్యవధితో రూ.1160 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. ఇప్పటికే గజ్వేల్ వరకు రూ.32 కిలోమీటర్ల మేర పూర్తయింది. సింగరేణితో కలిసి రైల్వే శాఖ నిర్మిస్తోన్న భద్రాచలం-సత్తుపల్లి మార్గానికి రూ.267 కోట్లు కేటాయించారు. 2010-11లో 54 కిలోమీటర్ల పొడవుతో రూ.928 కోట్ల వ్యయంతో ఈ రైల్వే మార్గం ముంజూరైంది. వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే జీఎం తెలిపారు. రూ.149 కోట్లు మహబూబ్ నగర్- మునీరాబాద్ కొత్త లైను కోసం కేటాయించారు. 1997-98లో దీనిని 244 కిలోమీటర్ల పొడవుతో రూ.1723 కోట్ల వ్యయంతో ఇది మంజూరైంది. ఈ మార్గంలో తెలంగాణలో ఉండే 66కి.మీలు మార్గంపై వ్యయం అంచనా ఉండగా... మిగతాది సౌత్ వెస్టన్ రైల్వేలో ఉంటుంది. రూ. 83.6 కోట్లు అక్కన్నపేట్-మెదక్ కొత్త రైల్వే లైను కోసం కేటాయించారు. 2012-13లో 17కి.మీ పొడవుతో రూ.118 కోట్ల వ్యయంతో ఈ లైన్​ మంజూరైంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావొస్తున్నట్లు జీఎం తెలిపారు.

రెండో లైను, మూడో లైన్ల కోసం కేటాయింపులు

రెండో లైను, మూడో లైను విషయంలో కూడా కేటాయింపులు జరిగాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రధానమైన కాజీపేట- బల్లార్ష మూడో లైన్ కోసం రూ.475 కోట్లు కేటాయించారు. 2015-16 లో 201 కిలోమీటర్ల వ్యవధిలో రూ.2063 కోట్లు వ్యయంతో ఇది మంజూరైంది. రాఘవపురం-కొలనూరు మధ్యనున్న 22 కి.మీల మేర మూడో లైను వేయటం పూర్తైంది. 44 కిలోమీటర్ల నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తున్నట్లు జీఎం తెలిపారు. కాజీపేట-విజయవాడ మధ్య మూడో లైన్ కోసం రూ.333 కోట్లు కేటాయింపులు జరిగాయి. 2012-13లో 220 కి.మీ పొడవుతో రూ.1953 కోట్ల వ్యయ అంచనాతో ఈ లైను మంజూరైంది. విజయవాడ- కొండపల్లి రైల్వే మార్గం పనులు పూర్తి కావస్తున్నాయి. కొండపల్లి- ఎర్రుపాలెం మధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్-మహబూబ్​నగర్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించింది కేంద్ర సర్కారు. 85 కి.మీ వ్యవధిలో రూ. 774 కోట్ల వ్యయ అంచనాతో దీనిని 2015-16లో మంజూరు చేశారు. షాద్ నగర్-గొల్లపల్లి మధ్యనున్న 30కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో బైపాస్ లైన్ల కోసం రూ. 426 కోట్లు కేటాయించారు. ఇందులో కాజీపేట వద్ద 10.65 కిమీల బైపాస్ లైను నిర్మించనున్నారు. దీని నిర్మాణం కొనసాగుతున్నట్లు జీఎం వెల్లడించారు.

విద్యుదీకరణ కోసం

సికింద్రాబాద్ స్టేషన్​లో రద్దీ తగ్గించేందుకు నిర్మించనున్న చర్లపల్లి టర్మినల్​కు రూ. 50 కోట్లు కేటాయింపులు జరిగాయి. మొత్తం రూ.240 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని.. నిర్మాణం వేగంగా ఉంటే ఇంకో రూ.50 కోట్లు నిధుల కోసం విజ్ఞప్తి చేస్తామని జీఎం గజానన్ మాల్యా తెలిపారు. ఈ టర్మినల్ నిర్మాణం మూడు సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాజీపేట పీఓహెచ్ వర్క్​షాప్ కోసం రూ.2 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సంవత్సరాల్లో బ్రాడ్ గేజ్ మార్గాల్లో విద్యుదీకరణ చేయాలని నిర్ణయించుకుంది. 2020-21 కేటాయింపులతో పోల్చితే ఈ సారి 246 శాతం నిధులను పెంచింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 155 కిలోమీటర్ల మార్గం విద్యుదీకరణ పూర్తైందని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 500 కిలోమీటర్లు విద్యుదీకరణ చేయాలనుకుంటున్నట్లు జీఎం గజానన్ మాల్యా తెలిపారు. తెలంగాణలో పెద్దపల్లి-నిజామాబాద్ మార్గంలో లింగంపేట-నిజామాబాద్ మధ్య విద్యుదీకరణ కోసం 20 కోట్లు కేటాయింపు జరిగింది. గద్వాల్ - రాయచూర్ మార్గం 57 కిమీటర్ల విద్యుదీకరణ కోసం రూ. 18 కోట్లు కేటాయించారు.

ఎంఎంటీఎస్​కు కేటాయింపులు తక్కువే..

సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణించేందుకు వీలు కల్పించే ఎంఎంటీఎస్​ విషయంలో కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి. ఎంఎంటీఎస్​ రెండో ఫేస్ కోసం రూ.10 లక్షలు కేటాయించారు. రూ.817 కోట్ల వ్యయంతో 2012-13లో ఎంఎంటీఎస్​ ఫేస్-2 మంజూరైంది. తెల్లాపూర్-రామచంద్రాపురం మధ్య 5.75కి.మీల మార్గం నిర్మాణం పూర్తయిందని.. రైళ్లు కూడా నడుస్తున్నాయని జీఎం తెలిపారు. మౌలాలి- ఘటుకేసర్ 12 కి.మీల మధ్య నాలుగో లైను నిర్మాణం పూర్తయింది. మల్కాజ్​గిరి-బొల్లారం-మేడ్చల్, ఫలక్​నుమా-ఉమ్దానగర్ మధ్య రైల్వే లైను నిర్మాణం పూర్తి కావొస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం వల్లే పనులు నెమ్మదిగా కొనసాగుతున్నట్లు జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్​ ఫేస్​-2లో భాగంగా ఘట్​కేసర్-యాదాద్రి పొడిగింపు కోసం రూ.10లక్షలు కేటాయించారు. 33కి.మీలకు ఈ లైనును రూ. 412 కోట్ల వ్యయ అంచనాతో నిర్మాణం చేపట్టామని జీఎం తెలిపారు. ఎంఎంటీఎస్​ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవటం వల్లే పనులు ముందుకు సాగటం లేదని గజానన్ మాల్యా తెలిపారు. ఎంఎంటీఎస్​ యేతర ప్రాజెక్టుల కోసం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందించినట్లు తెలిపారు. వారం, పది రోజుల్లో ఎంఎంటీఎస్​పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, పరిమిత సంఖ్యలో రైళ్లు నడపటంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

కొత్త మార్గాలకు కేటాయింపులు నిల్​..

తెలంగాణలో కొత్తగా నిర్మాణం చేపట్టాలన్న రైలు మార్గాలకు ఎలాంటి కేటాయింపులు జరగలేదు. అదిలాబాద్-ఆర్మూర్ మధ్య లైను నిర్మాణం ఊసేలేదు. సర్వే రిపోర్టు పూర్తయిందని.. మంజూరు కావాల్సి ఉందని జీఎం తెలిపారు. సికింద్రాబాద్ టర్మినల్ పునరాభివృద్ధి విషయంలో సర్వే చేసి కావాల్సిన భూమి వివరాలను రైల్వే బోర్డుకు అందించామని అన్నారు. ఈ విషయంలో ప్రణాళికలు ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రైవేటు రైళ్ల విషయంలో బోర్డు స్థాయిలో నిర్ణయం జరుగుతుందని.. అయితే వాటి నిర్వహణ కోసం తెల్లపూర్​లో స్థలాన్ని గుర్తించామని వెల్లడించారు. ప్రణాళికలో ఉన్న వట్టినాగులపల్లి టర్మినల్ వ్యయాదాయాల పరంగా సాధ్యం కాదని తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ వార్షిక బడ్జెట్​లో నిరుద్యోగ భృతి అంశం..!

ABOUT THE AUTHOR

...view details