తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదివాసీల అణచివేతపై రేవంత్​ ట్వీట్​.. రాహుల్​గాంధీ రీ-ట్వీట్​.. - Rahul Gandhi tweet

జల్‌-జంగిల్‌-జమీన్ రక్షణ కోసం పోరాటంలో ఆదివాసీలకు తాము అండగా ఉంటామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ​ భరోసా ఇచ్చారు. పోలీస్​ బలగాలతో తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల గొంతును అణచివేయడం దారుణమన్నారు. ఈ మేరకు రేవంత్​రెడ్డి చేసిన ఓ ట్వీట్​ను రాహుల్​ రీ-ట్వీట్​ చేశారు. మరోవైపు వచ్చే నెలలో రాహుల్​ రాష్ట్ర పర్యటనకు రానున్నట్లు టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​గౌడ్​ వెల్లడించారు.

ఆదివాసీల అణచివేతపై రేవంత్​ ట్వీట్​.. రాహుల్​గాంధీ రీ-ట్వీట్​
ఆదివాసీల అణచివేతపై రేవంత్​ ట్వీట్​.. రాహుల్​గాంధీ రీ-ట్వీట్​

By

Published : Jul 9, 2022, 5:30 PM IST

తెలంగాణలో తమ భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం శోచనీయమని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆదివాసీ గొంతును అణచివేసేందుకు పోలీసు బలగాలను ఉపయోగించడం తెలంగాణ ఆకాంక్షలకు అవమానకరమన్నారు. ‘జల్‌- జంగల్‌-జమీన్‌’ పోరాటంలో ఆదివాసీలకు అండగా ఉంటామని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. పోడు వ్యవసాయం చేసుకున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు అధికారుల దాడికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన ట్వీట్‌కు రాహుల్‌ గాంధీ ఈ మేరకు రీ-ట్వీట్‌ చేశారు.

రాష్ట్రంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాహుల్​ గాంధీ గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ అందులో ఒక ముఖ్య భాగమన్నారు. పోడు భూమి పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ప్రకటించి.. ఆ తర్వాత వెంటనే వెనక్కి తగ్గిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని రాహుల్‌ విమర్శించారు. తమ హక్కులను సాధించుకోవడంలో ఆదివాసీలకు అండగా ఉంటామన్నారు.

ఆగస్టులో రాష్ట్రానికి రాహుల్​..: మరోవైపు వచ్చే నెల(ఆగస్టు)లో రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి రానున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​కుమార్ గౌడ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభ రైతు డిక్లరేషన్ మాదిరి.. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే విధంగా ఉంటుందని పేర్కొన్నారు. రాహుల్ సభలో తీసుకునే డిక్లరేషన్‌ను మేనిఫెస్టోలో పెడతామని వెల్లడించారు. రాహుల్‌గాంధీ పర్యటన విషయమై గాంధీభవన్‌లో ముఖ్య నేతలతో సమావేశమై చర్చించినట్లు ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రజలు ఈ అరాచక పాలన అంతం కావాలని కోరుకుంటున్నారని మహేశ్​కుమార్​గౌడ్​ పేర్కొన్నారు. ఈ సంవత్సర కాలంలో కేసీఆర్ అవినీతి కట్టడి చేసే ప్రయత్నం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేపటితో పీసీసీ ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

రచ్చబండ పురోగతిపై చర్చ..: అంతకుముందు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్య నేతలు గాంధీభవన్​లో సమావేశమయ్యారు. పార్టీ వ్యవహారాల బాధ్యులు మానిక్కం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్లతో పాటు అన్ని జిల్లాల డీసీసీలు, పార్టీ ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమ పురోగతిపై సమావేశంలో చర్చించారు.

ఇవీ చూడండి..

'దేశంలో జరుగుతున్న ఉగ్రఘటనలకు.. భాజపాకు సంబంధం..!'

రణ్​బీర్​ రొమాన్స్.. భార్య ఆలియా అసూయ పడేలా వాణీకపూర్​తో హాట్​ షో..

ABOUT THE AUTHOR

...view details