Rahul Gandhi Telangana Tour Today :తెలంగాణ శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలను, విమర్శలను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. పక్కా వ్యూహాలతో పనిచేస్తోంది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఏఐసీసీ యంత్రాంగం అంతా రాష్ట్రంలో మోహరించింది. నియోజకవర్గాల వారీగా తాజా పరిస్థితులపై సమీక్షిస్తూ.. పోల్ మేనేజ్‌మెంట్ పై దిశానిర్దేశం చేస్తోంది.
Congress Election Campaign in Telangana : కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న స్టార్ క్యాంపెయినర్లు.. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా నాయకులు రాష్ట్రంలో మకాం వేసి అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరో వంద మందికి పైగా వార్ రూమ్, ఇతరత్రా అంశాలపై పని చేస్తున్నారు. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలతోపాటు జైరాం రమేష్‌లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్‌కు షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం
Priyanka Gandhi Telangana Election Campaign : వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌లో ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. దీంతో హస్తం నేతలు రోడ్డు మార్గాన వెళ్లి ప్రచారం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్‌ను అనుసరించలేకపోయారు. అన్ని ప్రచార సభలకు హాజరు కాలేకపోయారు. పాలకుర్తి, హుస్నాబాద్ నియోజక వర్గాల్ల్లో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో... హెలికాప్టర్‌లో ప్రయాణించే అవకాశం లేకుండా పోయింది. దీంతో హుస్నాబాద్ ప్రచారం పూర్తి చేసుకున్నాక.. మిగిలిన పర్యటనలు రద్దు చేసుకొని.. ప్రియాంక హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఆమె ఖమ్మంతో పాటు పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్ల్లో ప్రచారం చేస్తారు. అనంతరం.. విజయవాడకు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీ వెళతారు. ఈ నెల 27వ తేదీన తిరిగి రాష్ట్రానికి రానున్న ప్రియాంక.. రెండు రోజులపాటు ప్రచారంలో పాల్గొంటారు.