Rahul Gandhi Election Campaign in Telangana : రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా.. కాంగ్రెస్(Congress) పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది. ఇప్పటికే కొనసాగిస్తున్న ప్రచారాన్ని.. హస్తం పార్టీ అగ్రనేతలతో మరింత వేగంవంతం చేయాలని నిర్ణయించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఆయా రాష్ట్రాల్లో.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ స్థాయినేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణ మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లో ప్రచారం.. తుది దశకు చేరుకోనుంది.
'బీఆర్ఎస్ నాయకులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు'
Telangana Assembly Elections 2023 : ఇక తెలంగాణలోనూ ప్రచారం చేయడానికి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. ఇదే రోజున పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు ఉండనున్నాయి. రాష్ట్రంలో వివిధ తేదీల్లో ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రెండు హెలీకాప్టర్‌లను సిద్ధం చేసుకుంది. ఒకే రోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశాలు ఉండే అవకాశాలున్నాయి.
ఇవాళ రేపట్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో వీఐపీ పర్యటనలు ఉండేలా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఈ నెల 17వ తేదీ తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పర్యటనలు ఉండే అవకాశాలున్నాయి. తెలంగాణపై ఏఐసీసీ పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్.. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం.. నేతల మధ్య అంతరాలు వంటి అంశాలపై ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులతో సమీక్షించారు.