Rahul Gandhi Bharat Jodo Yatra Route Map: కన్యాకుమారిలో గత నెల 7న రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర మొదలైంది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఈ జోడో యాత్ర ప్రవేశించాల్సి ఉంది. ఏఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి జోడో యాత్ర ప్రవేశిస్తుంది. రాహుల్ గాంధీతో పాటు కశ్మీర్ వరకు పాదయాత్ర చేసే దాదాపు 300 మంది బస చేయడానికి అవసరమైన 20 కంటైనర్లు వారి వెంట వస్తున్నాయి.
హైదరాబాద్ నడి బొడ్డు నుంచే యాత్ర ప్రారంభం: భారత్ జోడో యాత్ర శంషాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి ఏ మాత్రం సంబంధం లేకుండా వెళ్లేట్లు రూట్ ఉండగా.. దానిపై పలుమార్లు కాంగ్రెస్ నాయకులు సమావేశమై చర్చించారు. ఆ రూట్‌ను హైదరాబాద్ నగరం నుంచి తీసుకెళ్లడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్న అంచనాకు వచ్చారు. నాయకుల అభిప్రాయం మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఏఐసీసీకి నివేదించారు. దీనిని పరిశీలించిన తర్వాత ఆదివారం పీసీసీ ఇచ్చిన రూట్ మ్యాప్‌నకు ఆమోదం లభించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
24న కర్ణాటక నుంచి మహబూబ్నగర్లోనికి ప్రవేశం: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నడిబొడ్డు మీదుగా కొనసాగనుండటంతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర నిర్వహణ ఉండాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పీసీసీ సీనియర్ నాయకులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నెల 24న కర్ణాటక నుంచి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనుంది.