రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు కొత్త సారథిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా ఇంటర్వ్యూ చేసి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ పదవి కోసం నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరపడానికి ఏఐసీసీ పరిశీలకులు ఈ నెల 17న రాష్ట్రానికి వస్తున్నారు. వారు అభిప్రాయాలు సేకరించి ఏఐసీసీకి నివేదిస్తారు. దీని ఆధారంగా నాయకులను రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
యువజన విభాగాలపై దృష్టి..
యువతను ప్రభావితం చేయకపోవడం వల్లే పార్టీ ఓటమి పాలవుతోందని కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి యువజన విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే యువజన కాంగ్రెస్ అధ్యక్షుల నియామక అంశాన్ని రాహుల్‌గాంధీ చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్‌కుమార్ యాదవ్‌ను ఆ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించగా... కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. విద్యార్థి విభాగం అధ్యక్షుడికి 26 ఏళ్లు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి 35 ఏళ్లు నిండకూడదనే నిబంధన అమల్లో ఉంది. యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పలువురు యువ నాయకులు పోటీపడుతున్నారు.