Gandhi Medical College Students Protest: సికింద్రాబాద్ గాంధీ వైద్యకళాశాల(Gandhi Medical College)లో ర్యాగింగ్ అంశంపై విద్యార్థులు మరోసారి ధర్నాకు దిగారు. అయితే జూనియర్లు కాకుండా సీనియర్లు ధర్నా చేయడం ఇందులో కొసమెరుపు. ఇటీవల కొందరు జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేశారని ఫిర్యాదులొచ్చాయి. కొత్తగా చేరిన విద్యార్థులను ఈ 10 మంది సీనియర్లు రాత్రిళ్లు తమ హాస్టల్ గదులకు పిలిపించి వారం నుంచి ర్యాగింగ్ చేస్తున్నారు. దీనిపై బాధితులు కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీతో దిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్( UGC Anti Ragging Cell)కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం.. అందుకు బాధ్యులైన 10మంది సీనియర్లను సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తూ వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డి నిన్న ఆదేశాలు జారీచేశారు.
Gandhi Medical College Ragging Issue : ఈ ఆదేశాలపై ఇవాళ సీనియర్లు ఆందోళనకు దిగారు. తమ సహచరులపై సస్పెన్షన్ వేటు సరికాదంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసిన పది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకుని.. కాలేజ్ ప్రిస్సిపల్-విద్యార్థుల మధ్య చర్చలు జరిపించారు. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకోవాలని.. సస్పెన్షన్ గురించి మరోసారి ఆలోచించాలని వైద్యవిద్య డైరెక్టర్ రమేశ్‌రెడ్డిని(Medical College Director Ramesh Reddy) విద్యార్థులు కోరారు. తమ తోటి సీనియర్ల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని.. వారు అసలు ర్యాగింగ్ చేయలేదని విద్యార్థులు స్పష్టం చేశారు.
10 Students Suspended in Gandhi Medical College: కానీ అధికారుల అంతర్గత విచారణలో పది మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్లు నిర్థారణ కావడంతోనే వారిని కళాశాల, వసతిగృహం నుంచి సస్పెండ్ చేసినట్లు డీఎంఈ తెలిపారు. ఇవాళ సీనియర్ల ధర్నాపై వైద్యారోగ్య శాఖ అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.