Telangana Budget Sessions 2023-24: రాష్ట్ర బడ్జెట్ 2023-24 సమావేశాలు కొనసాగుతున్నాయి. పోలీసు విభాగంలో రిటైర్డు అయిన వారిని కొనసాగిస్తున్నారని.. తద్వారా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు వివరించారు. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, పనిముట్లు ఇవ్వాలని తెలిపారు. రాబోయే వర్షాకాలంను దృష్టిలో ఉంచుకొని.. దెబ్బతిన్న పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని కోరారు. రూరల్ డెవలప్మెంట్లో భాగంగా వడ్డీ లేని రుణాలు మహిళలకు త్వరగా ఇవ్వాలని చెప్పారు. సకాలంలో రుణాలు అందక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని రఘనందన్ రావు వెల్లడించారు.
ఈరోజు పలు బిల్లులకు ఆమోదం:మరోవైపు శాసనసభలో ఈరోజు పలు బిల్లులకు ఆమోదం లభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. గురుకుల కళాశాలల్లో వ్యవసాయ కోర్సులు ప్రవేశపెడితే.. ఆ కాలేజీకి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని..అందు కోసమే తాజా సవరణ చేపట్టిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
భద్రాచలాన్ని మూడు గ్రామాలు చేస్తూ సవరణ: అనంతరం పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. భద్రాచలాన్ని మూడు గ్రామాలు చేస్తూ సవరణ ప్రవేశపెట్టారు. నిబంధనల ప్రకారం భద్రచలాన్ని పురపాలక సంఘంగా మార్చే అవకాశం లేదని చెప్పారు. అదే సమయంలో లక్ష వరకు జనాభా ఉంది కాబట్టి.. ఒకే పంచాయతీగా ఉంచే అవకాశం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. భద్రాచలం గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని వివరించారు. పరిపాల సౌలభ్యం కోసం భద్రాచలాన్ని మూడు గ్రామ పంచాయతీలు చేసినట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.