హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లోని ఓ నగల దుకాణంలో ఈ నెల 12న చోరి జరిగింది. భారీ మొత్తంలో వెండి, బంగారు నగలు పోవడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ఛేదించారు. దుకాణంలో పనిచేసే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.
''పప్పురాం దేవాసి అనే వ్యక్తి రెండేళ్లుగా నగల దుకాణంలో పనిచేస్తూ... యజమాని నమ్మకాన్ని పొందాడు. లాక్డౌన్ నేపథ్యంలో రోజూ రాత్రి ఎనిమిది గంటలకు దుకాణానికి తాళాలు వేసి యజమానికి అందించేవాడు. కానీ 12వ తేదీన రాత్రి దుకాణానికి తాళాలు వేయకుండా... షట్టర్ మూసివేసి... యజమానికి తాళాలు ఇచ్చాడు. అనంతరం నలుగురి సాయంతో దుకాణంలో చోరి చేశాడు. ఉదయాన్నే వచ్చిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న క్లూస్ టీం... ఘటనా స్థలంలోని ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. పప్పురాం అతని సోదరుడు, రాజస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు నగలు అపహరించారు.''