రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది కంటే 19 శాతం నేరాలు పెరిగాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదిక-2022ను ఆయన విడుదల చేశారు. 29 శాతం హత్యలు.. 38 శాతం అపహరణలు తగ్గాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం 66 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలు 19 శాతం.. మత్తు పదార్థాల కేసులు 140 శాతం పెరిగాయని వెల్లడించారు.
మహిళలపై నేరాలు 17 శాతం.. ఆస్తి సంబంధిత నేరాలు 23 శాతం పెరిగాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అత్యాచార కేసులు 1.3 శాతం, వరకట్న హత్యలు 5 శాతం తగ్గాయని పేర్కొన్నారు. మోసాలు 3 శాతం పెరిగాయని చెప్పారు. గుట్కా రవాణా కేసులు 131 శాతం తగ్గాయన్నారు. రహదారి ప్రమాద మరణాల్లో 0.91 శాతం.. రింగ్‌రోడ్డుపై ప్రమాదాల్లో మరణాలు 0.31 శాతం తగ్గుదల ఉందని వివరించారు.
ఈ ఏడాది మానవ అక్రమ రవాణాలో 62 కేసులు నమోదు చేశామని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 132 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. 79 మంది బాధితులను రక్షించామని చెప్పారు. 3162 రోడ్డు ప్రమాదాల్లో 655 మంది మృతి చెందారని వివరించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కేసుల్లో 296 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. రూ.10 కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.