ఈ విపత్కర సమయంలోనే మీకు మేమున్నామంటూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ముందుకొచ్చారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో నివసించే వారి ఆకలి తీర్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేస్తూ మేమున్నామని నిరూపిస్తున్నారు.
ఆశ్రమాలను దత్తత తీసుకుని
రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ఈ ఆశ్రమాలను దత్తత తీసుకుని వారికి చేయూత నిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తిని... ఆయా జోన్లలోని అనాథ, వృద్ధాశ్రమాల వివరాలను సేకరించాలని ఆదేశించారు. వారికి రేషన్, మందులు, భద్రతా పరికరాలు ఏవైతే అవసరాలున్నాయో వాటిని సైతం రూపొందించాలని సూచించారు. ప్రతి ఆశ్రమానికి ఉండే అవసరాలను అంచనా వేసి కార్యాలయానికి అందించాలని సూచించారు.
మొత్తం ఎంతమంది?
చైతన్యపురి, అబ్దుల్లాపూర్‌మెట్, బాలాపూర్, ఎల్బీనగర్, మీర్పేట్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆయా ఆశ్రమాల్లో అనాథలు, వృద్ధులు మొత్తం 1630 మంది ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు.