శివార్లను అడ్డాగా చేసుకుని చెలరేగుతున్న నల్లబొగ్గు కల్తీ మాఫియా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. వినియోగదారులకు చేరేలోపే నాణ్యమైన బొగ్గులో నాసిరకాన్ని కలుపుతున్న 8 మంది నిందితులను శుక్రవారం అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. రూ.1.62 కోట్లు విలువ చేసే 1050 టన్నుల నాణ్యమైన, 700 టన్నుల నాసిరకం బొగ్గు, రెండు లారీలు, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో సీపీ మహేశ్ భగవత్ తెలిపారు.
థర్మల్ విద్యుత్, స్టీల్, సిమెంట్, కాగితం, అల్యూమినీయం ప్లాంట్లు, కెమికల్, ఫార్మా కంపెనీల్లో బొగ్గును విరివిగా వినియోగిస్తుంటారు. పెద్ద కంపెనీలు సింగరేణి కాలరీస్, కృష్ణపట్నం పోర్టు, నెల్లూరు జిల్లా నుంచి తెప్పించుకుంటారు. చిన్న పరిశ్రమలు స్థానిక బొగ్గు వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తారు. ప్రధాన నిందితుడు వనస్థలిపురం హస్తినాపురానికి చెందిన గుండె రాజు(38) గగన్‌పహాడ్‌లోని బొగ్గు పరిశ్రమలో 2014 వరకు పనిచేశాడు. తర్వాత సింగరేణి కాలరీస్ నుంచి నాసిరకం బొగ్గు, బూడిదను కొన విక్రయించసాగాడు. లారీల యజమానులు, డ్రైవర్లతో కలిసి 2018 నుంచి కల్తీ దందాకు శ్రీకారం చుట్టాడు. ప్రత్యేకంగా ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లిలో వెంకటేశ్వర ట్రేడర్స్ పేరిట డంపింగ్ యార్డును నిర్వహిస్తున్నాడు.