దసరా పండుగ నేపథ్యంలో వరుస సెలవులు(dussehra holidays) రావడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలోని పలువురు తమ సొంత ఊళ్లకు తరలివెళ్తున్నారు. తమ ఇళ్లకు తాళం వేసి వెళ్తున్నవారు... దొంగతనాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊళ్లకు వెళ్లే వారు కాలనీలోని స్థానికులకు, కాపాలాదారుకు సమాచారం అందించాలని.. తాళం వేసి ఉన్న ఇంటిపై దృష్టి సారించాలని స్థానికులకు చెప్పాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కాలనీలో కాపాలాదారు తాళం వేసి ఉన్న ఇంటిని గమనించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలంటున్నారు. సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో తాము ఏ ఊరు వెళ్తున్నది.. తిరిగి ఎప్పుడు వస్తారు.. ఒకవేళ అనుకున్న సమయంలో రాకపోతే కూడా అందుకు సంబంధించి కూడా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
సీసీ కెమెరాలు అమర్చుకోవాలి..
ఊళ్లకు వెళ్లే వారు తమ ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు(cc cameras) అమర్చుకోవాలని.. కెమెరాల్లోని దృశ్యాలను చరవాణుల్లో చూసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్(rachakonda police commissioner) తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కాలనీలు, బస్తీల్లో నిఘా అధికం చేయాలని, అనుమానితులు కనిపిస్తే అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని ఆయన సూచించారు. వరుస సెలవుల నేపథ్యంలో దొంగతనాలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అధికారులు, సిబ్బందిని సీపీ ఆదేశించారు.
చాలా మంది ఊరికి వెళ్తున్నారు. ఎవరెవరు విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి సెలవులకు వెళ్తున్నారో వారికి రాచకొండ పోలీసుల తరఫున విజ్ఞప్తి. గతంలో సంక్రాంతి, దసరా సెలవులకు లాక్ చేసి వెళ్లిన ఇళ్లలో చాలా దొంగతనాలు జరిగాయి. ఈ దొంగతనాలు చేసే గ్యాంగ్‌లు మన రాష్ట్రం నుంచే కాకుండా బయట నుంచి కూడా వస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి దొంగతనాలు చేస్తారు. సెలవులకు వెళ్లే వాళ్లు విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లు, తెలిసిన వాళ్ల ఇళ్లలో భద్రపరచుకోవడం చాలా మంచిది. సెలవులకు వెళ్లే ముందు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తే అక్కడ పెట్రోలింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. -మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు పోలీసు కమిషనరేట్లలోని అధికారులు, సిబ్బంది ఇప్పటికే కాలనీల్లో పర్యటిస్తూ తీసుకోవాల్సి జాగ్రత్తలపై స్థానికులకు సూచనలు చేస్తున్నారు.