Rachakonda CP on Child Labour Awareness : సంతోషంగా చదువుకుంటూ ఆట పాటలతో సాగాల్సిన పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్న బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు(Sudheer babu) అన్నారు. నేరెడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ సమాజంలో బాల కార్మిక వ్యవస్థ ఒక వ్యాధిలాగా మారిందని, అది ఎంతో మంది అమాయక పిల్లల బాల్యాన్ని నాశనం చేస్తోందని పేర్కొన్నారు.
గతాన్ని మరచిపోయి కొత్త జీవితానికి ముందడుగు వేయాలి : సీపీ సుధీర్ బాబు
తల్లిదండ్రుల పేదరికం వల్ల పిల్లలు వెట్టి చాకిరీ కోరల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని రాచకొండ సీపీ(Rachakonda CP) ఆవేదన వ్యక్తంచేశారు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా, తమ పిల్లలను మాత్రం వెట్టి చాకిరీ కూపంలోకి నెట్టకూడదని, పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఉచితంగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, ప్రజలు కూడా దాన్ని తమ నైతిక బాధ్యతగా భావించాలన్నారు.