రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలే: సీపీ మహేశ్ గ్రేటర్ పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ఎల్బీనగర్ జోన్‌లో 13 వార్డులు, మల్కాజీగిరి జోన్‌లో 17 వార్డులున్నాయని వెల్లడించారు. 7 సర్కిళ్ల పరిధిలోని 30డివిజన్లలో 1,640 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. 498 సమస్యాత్మక, 101 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయని తెలిపారు.
101 రూట్ మొబైల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఏడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 6 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఒక్కో సర్కిల్‌కు ఒక్కో ఏసీపీకి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 8 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 6 డీఆర్సీ కేంద్రాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజకీయ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించొద్దని సూచించారు.
ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని సీపీ మహేశ్ భగవత్ అన్నారు. రాజకీయ నేతలు ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కోరారు. దీనివల్ల రెండు మతాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. 2004లో దక్షిణ మండల డీసీపీగా తాను పని చేసినట్లు చెప్పారు. అప్పుడు తలకు హెల్మెట్, చేతిలో లాఠీ పట్టుకొని ప్రతి శుక్రవారం చార్మినార్ దగ్గర విధులు నిర్వహించినట్లు గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు ఉద్దేశపూరిత ప్రసంగాల వల్ల ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని సూచించారు. అలాంటి వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చార్మినార్‌కు ఉన్న నాలుగు స్తంభాలు హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయినీ సూచిస్తాయని వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూరిత పోస్టింగ్‌లను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆయా సామాజిక మధ్యమాల యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లి తొలగించాలని అన్నారు.