సీసీఎంబీలో నిర్వహించిన 72వ గణతంత్ర వేడుకలకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొన్న వివిధ సవాళ్లను సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ప్రస్తావించారు. కొవిడ్-19 నమూనాలను పరిక్షించడంలో సీసీఎంబీ పాత్రను ఆయన వివరించారు.
1950 నుంచి అమల్లోకి వచ్చిన పూర్ణ స్వాతంత్య్రం, భారత రాజ్యంగం ప్రాముఖ్యతను సీపీ మహేశ్ భగవత్ వివరించారు. భారత పౌరుల హక్కులను, విధులను ఆయన ప్రస్తావించారు. సీసీఎంబీ వ్యవస్థాపక డైరెక్టర్ పీఎం భార్గవతో ఆయన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. దేశంలో మూఢ నమ్మకాలతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వన్యప్రాణి ఫోరెన్సిక్, డీఎన్ఏ వేలిముద్రలపై సీసీఎంబీ ప్రాముఖ్యతని వివరించారు. ఇటీవల హైదరాబాద్ జూలో చంపిన పులి చర్మాన్ని మహారాష్ట్రలోని ముంబ్రాలో కనుగొనడాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కేసును సీసీఎంబీ సాయంతో పరిష్కరించినట్లు తెలిపారు. డీఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానంతో అనేక జన్యు పరమైన అంశాలు, క్రిమినల్ కేసులను పరిష్కరించడంలో ఈ సంస్థ సహకారాన్ని ఆయన ప్రస్తావించారు. సీసీఎంబీ పరిశోధనా కార్యకలాపాలను ఆయన అభినందించారు.