Rachakonda CP Praises woman constable in LB Nagar : రాచకొండ కమిషనరేట్ బాస్ డీఎస్ చౌహాన్. ఇటీవల ప్రశ్నాపత్రాల లీకేజీలు కలకలం రేపుతుండటంతో హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్ష జరుగుతున్న కేంద్రాలను స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు సీపీ చౌహాన్ కారు ఆగింది. అప్పటికే విధుల్లో భాగంగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు సీపీని చూడగానే ఆందోళనకు గురై, దగ్గరకు వెళ్లి, సెల్యూట్ చేశారు.
Rachakonda CP Praises LB Nagar constable : హడావుడిగా వచ్చిన సీపీ చౌహాన్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు లోపలికి వెళ్లబోయారు. అక్కడున్న ఓ మహిళా కానిస్టేబుల్ అకస్మాత్తుగా సీపీని అడ్డుకున్నారు. ఒక్కసారిగా ఆమె చేసిన పనికి అక్కడున్న పోలీసు అధికారులంతా షాక్. ఏమైందోనని అందరూ ఆలోచిస్తున్న సమయంలో.. ఆ కానిస్టేబుల్.. "సర్.. మీరు ఫోన్‌తో వెళ్తున్నారు.. ఎగ్జాం సెంటర్‌లోకి ఫోన్ అనుమతి లేదంటూ" సీపీకి చెప్పడంతో చౌహాన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం ఆమెకు మొబైల్ ఇచ్చి లోపలికి వెళ్లారు.
అంకితభావంతో విధులు నిర్వహించాలి: పరీక్షా హాలును తనిఖీ చేసిన అనంతరం బయటకు వచ్చిన సీపీ చౌహాన్.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కల్పన ధైర్యసాహసాలు, విధి నిర్వహణ తీరును ప్రశంసించారు. ఆమెను అభినందిస్తూ.. తన జేబులో నుంచి ఐదు వందల రూపాయల నోటును తీసి.. కల్పనకు బహుమతిగా అందజేశారు. ఆమెను రివార్డ్‌కు ఎంపిక చేయాలంటూ అక్కడున్న పోలీసులకు సూచించారు.