Rachakonda Commissionerate Annual Crime Report 2023 :రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86 శాతం నేరాలు పెరిగాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను ఇవాళ ఆయన విడుదల చేశారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయన్న సీపీ, మహిళపై నేరాలు 6.65 శాతం తగ్గాయని వెల్లడించారు. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు(Cyber Cases) నమోదయ్యాయని సీపీ తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంక్ ఖాతాలో రూ. 89.92 లక్షల నగదును ఫ్రీజ్ చేసి పోలీసులు బాధితులకు అప్పగించారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 200 మంది చిన్నారులను పోలీసులు కాపాడారని సీపీ వివరించారు.
Annual Crime Report in Rachakonda 2023 :మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 16,594 కేసులు నమోదయ్యాయి. అలాగే గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు(Road Accident Deaths) 16 శాతం పెరిగాయని చెప్పారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 71 మంది బాధితులకు విముక్తి కలిగించామన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8,758 ఫిర్యాదుల్లో 4,643 పరిష్కారించామని తెలిపారు. కమిషనరేట్ పరిధి నేరాల్లో రూ.12.77 కోట్లు రికవరీ చేశామన్నారు. గతేడాదితో పోలిస్తే రికవరీ రేటు 2 శాతం పెరిగిందని సీపీ సుధీర్ బాబు వివరించారు.
యాక్సిడెంట్లు తగ్గాయి, రేప్ కేసులు పెరిగాయి - హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక నేర నివేదిక విడుదల
'రాచకొండ పరిధిలో గతేడాదితో పోలిస్తే 6.86శాతం నేరాలు పెరిగాయి. రాచకొండ పరిధిలో సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయి. మహిళలపై నేరాలు 6.65 శాతం తగ్గాయి. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదయ్యాయి. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు, 972 మంది అరెస్టు చేశాం. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. 20 కేసుల్లో నిందితులకు జీవితఖైదు పడింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16,594 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో 633 మంది మృతి, 3,205 మందికి గాయాలయ్యాయి. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు 16 శాతం పెరిగాయి.' -సుధీర్ బాబు, రాచకొండ సీపీ
రాచకొండ పరిధిలో వార్షిక నేరాల వివరాలు :మహానగరాన్ని మాదకద్రవ్యాల రహిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో కఠిన నిర్ణయాలు చేపడుతున్న పోలీసులు ఈ ఏడాది మత్తు పదార్ధాలకు సంబంధించి 282 కేసుల్లో 698 మందిని అరెస్టు చేశారు. నిందితుల్లో విదేశీయులు, అంతర్రాష్ట్ర నేరస్థులు(Interstate Criminals) కూడా ఉన్నారు. 12 మంది పై పీడీ చట్టం ప్రయోగించారు. 5882 కిలోల గంజాయి, 6.55 లీటర్ల హష్ ఆయిల్, 377 గ్రాములు హెరాయిన్ సహా ఇతర మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.