తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా పసుపు బోర్డు ఏర్పాటు - turmeric board news

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఉన్నత స్థాయిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పలు రకాల పంటల బోర్డులను కొనసాగించాలా లేక ఇతర సంస్థల్లో విలీనం చేయాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. పలు రకాల పంటల బోర్డులను యథాతథంగా కొనసాగించాల్సిన అవసరం లేదని, వాటిని ఇతర వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విలీనం చేస్తే మేలు అనే సూచనలు ఇప్పటికే కేంద్రం పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ రైతులు ఎంతోకాలంగా ఉద్యమిస్తున్న పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటే అంత సులభం కాదని కేంద్ర వ్యవసాయశాఖ వర్గాలు ‘ఈనాడు- ఈటీవీ భారత్​’కు చెప్పాయి.

రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా పసుపు బోర్డు ఏర్పాటు
రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా పసుపు బోర్డు ఏర్పాటు

By

Published : Feb 6, 2021, 8:06 AM IST

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, ఆధునాతన పరిజ్ఞానంతో పరిపాలన కేంద్రీకృతం చేయాలనే విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయని కేంద్రం చెబుతోంది. 1980 ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ సంస్థలను, స్వయంప్రతిపత్తి సంస్థలను ఏర్పాటుచేశారు. ఇప్పుడు ప్రపంచమే ఒక గ్రామంగా మారిపోయేలా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున అన్ని సంస్థలు అవసరం లేదని, వాటి సంఖ్యను కుదించి విలీనం చేయాలని కేంద్రం గట్టిగా భావిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 93 సంస్థలపై కేంద్ర వ్యయ మంత్రిత్వశాఖ అధ్యయనం చేసింది. ‘‘52 సంస్థలను 17గా మార్చేయాలి. ఒకదానిలో ఒకటి విలీనం ద్వారా ఈ పనులు చేయాలి. మూడు సంస్థల కార్యకలాపాలను కేంద్ర ప్రభుత్వ శాఖల ద్వారా నిర్వహిస్తే సరిపోతుంది. 22 సంస్థలను మాత్రమే యథాతథంగా కొనసాగించాలి. 14 సంస్థలకు కేంద్రం ఫండింగ్‌ ఆపేయాలి. రెండింటిని పూర్తిగా మూసివేయాలి’’ అని తాజాగా కేంద్రానికి సూచించింది.

  • ఉదాహరణకు దేశవ్యాప్తంగా కొబ్బరితోటల సాగు కోసం 1981లో జాతీయ కొబ్బరి బోర్డును కేరళలోని కోచిలో పెట్టారు. స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న ఈ బోర్డును కొనసాగించాల్సిన అవసరం లేదని జాతీయ ఉద్యాన మండలిలో విలీనం చేయాలని కేంద్ర వ్యయ శాఖ తాజాగా సిఫార్సు చేసింది.
  • కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల సాగు పెంచేేందుకు 2006లో నాగాలాండ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ ఉద్యాన సంస్థకు సంబంధించి కూడా ఇలాగే సూచించింది.

ఒక్కో పంటకు ఒక్కో బోర్డు ఉంటే...

ఒక్కో పంటకు ఒక్కో బోర్డు ఉండటం వల్ల రైతులకు ఎంతో లాభదాయకం. ఆ పంటపైనే బోర్డులోని శాస్త్రవేత్తలు, నిపుణులు పనిచేస్తారు. వారు ఈ పంటకు సంబంధించిన ఆధునాతన పరిజ్ఞానం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉందనేది ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఉమ్మడి ఏపీ రాష్ట్రమున్నప్పుడు తెలంగాణ పసుపు దిగుబడి పెంపుపై పెద్దగా దృష్టి లేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కొత్త వంగడాలు తెచ్చి రైతులకు ఇచ్చి సాగు పద్ధతుల్లో మెలకువలు నేర్పారు. దీనివల్ల పసుపు దిగుబడి బాగా పెరిగిందని జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు కూడా రాష్ట్ర ఉద్యానశాఖను ఇటీవల ప్రశంసించింది. ‘జాతీయ పసుపు బోర్డు ఇక్కడే ఉంటే ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుని రైతులను ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లు, వ్యాపారులతో అనుసంధానం చేసి పంటకు ధర పెరిగేలా చూస్తుంది. తద్వారా రైతులకు ఆదాయం పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది’ అని సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారి చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి మోదీ చొరవ చూపితేనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

పసుపు బోర్డు కోసం ఇప్పటిదాకా...

దేశంలో పసుపు పంటకు ప్రత్యేకంగా బోర్డు లేదు. కోచి కేంద్రంగా సుగంధ ద్రవ్యాల బోర్డు పనిచేస్తోంది. దాని ప్రాంతీయ కార్యాలయాలు వరంగల్‌, హైదరాబాద్‌లలో ఉన్నాయి. ఈ బోర్డు పరిధిలోనే పసుపు, అల్లం, వెల్లుల్లి తదితర సుగంధ ద్రవ్యాల పంటలు ఉన్నాయి. దాని నుంచి పసుపును విడదీసి నిజామాబాద్‌లో ప్రత్యేకంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు ఎంతోకాలంగా ఉద్యమిస్తున్నారు. మరోపక్క ఈ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలున్న వరంగల్‌, హైదరాబాద్‌లలోనే మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేయలేదు. హైదరాబాద్‌ కార్యాలయంలో కేవలం ఒకే ఒక్క ఉద్యోగి, వరంగల్‌లో నలుగురు పనిచేస్తున్నారు. రైతులు పసుపు బోర్డు కోసం ఉద్యమిస్తుండడం, రాజకీయ ఒత్తిడులతో నిజామాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేసి వరంగల్‌ నుంచి ముగ్గురు ఉద్యోగులను అక్కడికి తరలించారు.

  • అనేక బోర్డులు ఉండటం వల్ల కేంద్ర బడ్జెట్‌ వ్యయం పెరుగుతోందని, వాటిని భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్‌) తరఫున ప్రస్తుతమున్న జాతీయ పరిశోధనా సంస్థల్లోనే కలిపేసి వాటి విభాగాలుగా కొనసాగించాలని వ్యయ శాఖ ప్రతిపాదించింది. ‘‘ఉదాహరణకు సుగంధ ద్రవ్యాల బోర్డులో ఆ పంటల పరిశోధనలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను ఐసీఏఆర్‌ సంస్థల్లో విలీనం చేయాలి. పంటల మార్కెటింగ్‌పై పనిచేస్తున్న నిపుణులను భారత ఎగుమతుల మండలిలో నియమిస్తే మేలు’’ అని సూచించింది.

ఇవీచూడండి:' నేటి నుంచి పోలీస్, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సినేషన్​'

ABOUT THE AUTHOR

...view details