Queen Elizabeth's connection with Hyderabad: ఏడు దశాబ్దాల సుదీర్ఘ పాలనలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 ఎన్నో దేశాల్లో పర్యటించారు. భారత్‌తోనూ ఆమెకు మంచి అనుబంధం ఉంది. మన దేశాన్ని మూడు పర్యాయాలు (1961, 1983, 1997) పర్యటించిన రాణి ఎలిజబెత్.. ఓసారి హైదరాబాద్ నగరానికీ విచ్చేశారు. ఆ సమయంలో నాలుగు రోజుల పాటు నగరంలో ఉన్న రాణి పలు చారిత్రక ప్రాంతాలను సందర్శించారు.
బ్రిటన్ రాణికి స్వాగతం పలుకుతున్న అప్పటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్..:1983 నవంబరులో రాణి ఎలిజబెత్ తన భర్త ఫిలిప్‌తో కలిసి 10 రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన రాణీ దంపతులకు బేగంపేట విమానాశ్రయంలో అప్పటి సమైక్య రాష్ట్ర గవర్నర్ రామ్‌లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సాదర స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాలను ఎలిజబెత్ సందర్శించారు. తొలుత ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఇల్‌ను సందర్శించి అక్కడి ఉద్యోగులతో ముచ్చటించారు.
అక్కడి నుంచి భారత మెట్ట పంటల పరిశోధనా కేంద్రం ఇక్రిశాట్‌కు వెళ్లి రెండున్నర గంటలపాటు గడిపారు. అక్కడి నుంచి నేరుగా కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంతానికి వెళ్లారు. ఈ టూంబ్స్ నుంచే బైనాక్యులర్‌లో గోల్కొండ కోటను సందర్శించారు. నగరంలోని హోలీ ట్రినిటీ చర్చిని కూడా చూశారు. ఆ తర్వాత తిరిగి దిల్లీ వెళ్లిపోయారు. హైదరాబాద్ ఆతిథ్యానికి తానెంతో ముగ్ధురాలినయ్యానని రాణి ఆనందం వ్యక్తం చేశారు.