Q-net company scams: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం భక్తులాపురానికి చెందిన గోపాల్‌దాస్ రాము ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఈ-కామర్స్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో చేరాలని అతనితో పాటు చదివిన త్రివేణి ప్రతిపాదించారు. వారానికి రూ.50-60 వేలు సంపాదించే అవకాశముందని చెప్పడంతో రాము గత ఏడాది ఆగస్టులో రూ.1.5 లక్షలు కట్టి సభ్యత్వం తీసుకున్నారు. కట్టిన సొమ్ముకు క్యూనెట్ అనుబంధ సంస్థ పేరిట డిన్నర్‌సెట్ పంపించారు. దాని విలువ రూ.1 లక్షా 17 వేల 200గా ఉంటుందని చెప్పారు.
ఉద్యోగం కోసం రాము సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని కార్యాలయానికి వెళితే.. బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేసి సంస్థలో చేర్పించే పని అప్పగించారు. కొత్తగా సభ్యుల్ని చేర్పిస్తేనే కమీషన్ వస్తుందని చెప్పడంతో అది గొలుసుకట్టు వ్యాపారమని రాము గ్రహించాడు. వెంటనే తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగాడు. గంజాయి కేసులో ఇరికిస్తాం.. నిర్భయ కేసు పెడతామంటూ రామును బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు. దీంతో ఆయన గత డిసెంబరు 31న మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు స్పందించకపోవడంతో.. ఫిబ్రవరి 1న పెన్‌పహాడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈలోగా క్యూనెట్ సంస్థ కార్యాలయంలో గత నెల సంభవించిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. అందులో త్రివేణి ఒకరు.
‘ముందు కొంత డబ్బు కట్టి సభ్యత్వం తీసుకో.. మరో ఇద్దరిని చేర్పించు.. కొత్తవారిని చేర్పిస్తూ ఉంటే కమీషన్ నుంచే జీతం వస్తుంది. లేదంటే కట్టిన డబ్బులు, జీతం రెండూ రావు..’ ఇదీ గొలుసుకట్టు వ్యాపారంలో మోసాలు. ఈ విధానంపై దేశంలో నిషేధం ఉండటంతో మోసగాళ్లు తమది గొలుసుకట్టు వ్యాపారం కాదని నేరుగానే ఉత్పత్తుల్ని విక్రయిస్తున్నామని కట్టు కథలు అల్లి మాయ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికినా.. అసలైన యాజమానులు తప్పించుకుని మధ్యలో ఉండే ఏజెంట్లు మాత్రం అడ్డంగా బలైపోతున్నారు. తమ సంస్థలో తొలుత చేరిన వారు విధి లేని పరిస్థితుల్లో మోసాలకు పాల్పడేలా చేసి.. వారిని ఇరికించడమే గొలుసు కట్టు సంస్థల వ్యాపార కుయుక్తి.
తెలిసో తెలియకో వీటిలో చేరే సభ్యులు తమ డబ్బును కమీషన్ రూపంలో తిరిగి రాబట్టుకునేందుకు తమ బంధువులనో.. సన్నిహితులనో మాయ చేసి సభ్యులుగా చేర్పిస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కేసుల పేరిట భయపెడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం, సీఐడీ ఉదాసీనంగా వ్యవహరిస్తుండం గమనార్హం.