తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆందోళన

హైదరాబాద్​లోని రామ్​నగర్​ చౌరస్తాలో ప్రగతిశీల యువజన సంఘం(పీవైెఎల్​), ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) నాయకులు ఆందోళన చేపట్టారు. అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

pyl and pow leaders protested to include corona treatment in arogyasree in hyderabad
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆందోళన

By

Published : Aug 25, 2020, 5:10 PM IST

అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్​ చేస్తూ పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు ఆందోళన చేపట్టారు. కరోనా నేపథ్యంలో పేద ప్రజల జీవితాలు చిధ్రమవుతున్నాయని, ఉపాధి లేక వ్యాపారాలు సాగక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా గడపాల్సి వస్తోందని పీవైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్​ ప్రదీప్ అన్నారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని హైదరాబాద్​లోని రామ్​నగర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లో బతికే చిరుద్యోగులు, చిల్లర వ్యాపారస్థులు రోడ్డున పడుతున్నారని, ప్రైవేటు విద్యా సంస్థలలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఆర్థిక బాధలు వర్ణణాతీతమన్నారు. దీనికి తోడు సీజనల్ వ్యాధులు తోడవడం వల్ల ఏది కరోనానో, ఏదీ మామూలు రోగమో తెలియక నానా అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఇదే అదనుగా కార్పొరేట్ ఆస్పత్రులు విచ్చలవిడిగా నిలువుదోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.

ఉపాధి లేక, వైద్యం ఖర్చులు భరించలేని క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ఉంటే, అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు.. సూచనలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ప్రజలను ఆదుకోవాలని.. వారికి ఆరోగ్యం పట్ల, జీవితం పట్ల భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన అన్నారు. నిరుద్యోగ భృతి అమలు చేసి, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులతో పాటు, రూ.7500 ఇవ్వాలని, ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులను ఉచితంగా చేయాలన్నారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: 'అసెంబ్లీ సమావేశాలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details