తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాలి నొప్పి ఉందని భయపడ్డాం.. కానీ అద్భుతంగా ఆడింది' - హైదరాబాద్ తాజా వార్తలు

కామన్వెల్త్‌ క్రీడల్లోభారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్వర్ణ పతకం సాధించడం పట్ల.. ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె విజయాలకు గర్వపడుతున్నామని.. తండ్రి రమణ, తల్లి విజయ తెలిపారు. కాలి నొప్పి ఉన్నా ప్రత్యర్థిపై అలవోకగా విజయం సాధించడాన్ని వారు ప్రశంసిస్తున్నారు. తమ ఆనందాన్ని ఈటీవీ భారత్​తో​ పంచుకున్నారు.

పీవీ సింధు
పీవీ సింధు

By

Published : Aug 8, 2022, 8:49 PM IST

కాలి నొప్పి ఉందని భయపడ్డాం.. కానీ అద్భుతంగా ఆడింది

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విశ్వవేదికపై మరోసారి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ ఫైనల్లో కెనడాకు చెందిన మిషెల్లీ లీపై జయభేరి మోగించి స్వర్ణం సాధించడం పట్ల దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కామన్వెల్త్‌ క్రీడల్లో సింధు పసిడిని ముద్దాడటంతో ఆమె తల్లిదండ్రులు తమ ఆనందాన్ని ఈటీవీ భారత్​తో​ పంచుకున్నారు.

ఈటీవీ భారత్: కంగ్రాట్స్‌ సర్‌.. ఎలా ఫీల్‌ అవుతున్నారు?

సింధు తండ్రి రమణ: చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సింధు 2014 కామన్వెల్త్‌లో కాంస్యం, 2018లో రజతం, ఇప్పుడు గోల్డ్‌. ఒక క్రీడాకారిణి 12 ఏళ్ల నుంచి కష్టపడుతూ.. ప్రతి ప్లేయరూ గోల్డ్‌ కోసమే కష్టపడతారు. కానీ అది రాకపోతే చాలా నిరుత్సాహానికి గురవుతారు. ఆ కలను సాకారం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

ఈటీవీ భారత్: మిషెల్లీ లాంటి చాలా సీనియర్‌ ప్లేయర్‌తో ఫైనల్స్‌లో సింధూ చాలా ఈజీగా ఆడింది కదా!

ఇది కాన్ఫిడెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్లేయర్ల కన్నా ర్యాంకుల్లో సింధు పెద్దది. వీళ్లందరిపైనా ఆడి చాలాసార్లు గెలవడం వల్ల అదొక కాన్ఫిడెన్స్‌ ఉంటుంది. ఫైనల్స్‌లో ప్రతిఒక్కరూ ఒత్తిడితో ఆడతారు. దాన్ని అధిగమించి నాలుగైదు పాయింట్లు లీడ్‌లో పెట్టుకొని రిథమ్‌ను అలాగే మెయింటెయిన్‌ చేసుకొని గెలిచింది. దీనివల్ల చాలా ఈజీ అయిపోయింది. లేకపోతే అందరం టెన్షన్‌ పడాల్సి వచ్చేది.

ఈటీవీ భారత్: సింధు ఆడే ప్రతి గేమ్‌లోనూ మీరు పక్కనే ఉండి ఎంకరేజ్‌ చేస్తుంటారు. ఇప్పుడు వెళ్లినప్పుడు ఎలాంటి సూచనలు ఇచ్చారు?

నేను ముందే సింధుకి చెప్పాను. మార్నింగే మెసెజ్‌ చేశాను. ఆ అమ్మాయి ఫలానా రీతిలో ఆడుతుంది.. నువ్వు ఇలా ఆడాలని చెప్పా. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, ఫిజియో ఉన్నారుగనక కొంచెం తప్పులేమైనా చేసినా కొంచెం నేనేవాళ్లతో చెప్పి ఇలా సూచించండి చెప్పాను.

ఈటీవీ భారత్: సింధు స్వర్ణం సాధించడం పట్ల రాష్ట్రపతి దగ్గర నుంచి దేశమంతా గర్విస్తూ ట్వీట్లు చేస్తున్నారు.. ఒక ఫాదర్‌గా ఆ ఫీలింగ్‌ మీకెలా ఉంది?

ఆ ఫీలింగ్‌ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. సింధు దేశానికే గర్వకారణమంటూ 2016లోనే కటౌట్లు పెట్టారు. ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ని తనంతట తాను క్రియేట్‌ చేసుకుంది. ప్రతిఒక్కరికీ సింధు తెలుసు. భగవంతుడు ఇలాంటి అమ్మాయిని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ నుంచి ఇది రెండో గోల్డ్‌. సింధు తెలంగాణలోనే పుట్టింది. ఉద్యోగ రీత్యా ఇప్పుడు ఏపీలో చేస్తోంది. ఆమెకు తెలంగాణ ఒక కన్ను. ఆంధ్రా ఇంకొక కన్ను. సింధుకి ఏదీ తక్కువ కాదు.

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఒకేరకంగా ప్రోత్సహించాయి. ఎవరూ తక్కువ చేయలేదు. ఎంతగానో ప్రోత్సహించిన సీఎం కేసీఆర్‌, సీఎం జగన్‌లకు కృతజ్ఞతలు. ప్రతి ప్లేయరూ ఎంచుకున్న గేమ్‌లో కష్టపడాలి. కష్టం లేనిదే ఫలితం రాదు. కష్టం ఒక్కరోజో ఒక్క నెలలోనో రాదు. ఎన్నో ఏళ్ల కృషి ఉండాలి. అలా ఆలోచించి ప్రతి ప్లేయరూ కష్టపడితే మనకు బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ప్లేయర్లను కేంద్ర ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ, క్రీడా మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఎంకరేజ్‌ చేస్తున్నాయి. ప్రతి దేశంతో పోటీ పడుతూ బాగా ఆడాలి. గెలవాలన్న పట్టుదల ఉండాలి. మన ప్లేయర్లకు ఆ పట్టుదల ఉంటుంది. రేపు రాబోయే ఏషియన్‌ గేమ్స్‌ గానీ, ఒలింపిక్స్‌లో గానీ కష్టపడి ఆడాలి.

ఈటీవీ భారత్: కామన్వెల్త్‌తో పాటు ఇంకేదైనా తన కల అని సింధు చెప్పారా?

దీని తర్వాత వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌.. ఇలా ఏటా ఉంటూనే ఉంటాయి. తర్వాత ఏషియన్‌ గేమ్స్‌ ఉన్నాయి. తన లక్ష్యం 2024 ఒలింపిక్స్‌లో ఆడదామని. ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఆడితే తప్పకుండా మెడల్‌ గెలవాలని కోరుకుంటున్నాం.

భయపడ్డాం.. కానీ ఎక్కడా రిలాక్స్‌ కాలేదు: సింధు తల్లి విజయ

‘‘కామన్వెల్త్‌ గేమ్స్‌లో సింధు స్వర్ణ పతకం సాధించడం ఆనందంగా ఉంది. దేశం కోసం బ్యాడ్మింటన్‌లో తను మెడల్‌ సాధించడం చాలా సంతోషకరం. దేశం సాధించిన పతకాల్లో సింధు కూడా ఒక స్వర్ణం సాధించింది. రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా కాలు స్ట్రెయిన్‌ అయింది. దీంతో కొంచెం మేం భయపడ్డాం. కానీ అంచనాలకు తగినట్టుగా తన ఆటతీరుతో ఫైనల్స్‌లో గెలవడం ఆనందంగా ఉంది. ఎక్కడా రిలాక్స్‌ కాకుండా తన మొహంలో పెయిన్‌ కూడా ఎక్కడా కనబడనివ్వలేదు. ఇన్నేళ్లు కష్టపడిన సింధుకు ప్రతిఫలం లభించినందుకు సంతోషంగా ఉంది. అలాగే, అందరి తల్లిదండ్రులకూ నేను చెప్పేదొకటే. మీ పిల్లలు ఏ రంగాన్ని ఇష్టపడుతున్నారో అందులోనే ప్రోత్సహిస్తే తప్పకుండా వాళ్ల కోసం ఆడతారు.. మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు. అందువల్ల వాళ్లకు ఇష్టమైన ఫీల్డ్‌లో ఎంకరేజ్‌ చేయాలని కోరుతున్నా. కామన్వెల్త్‌ క్రీడల్లో అందరూ బాగా ఆడారు. చాలా పతకాలు వచ్చాయి’’ అన్నారు.

ఇవీ చదవండి:'అవమానాలు భరిస్తూ ఉండలేను.. కాంగ్రెస్​కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా..'

యువకుడ్ని పొట్టనపెట్టుకున్న మొసలి.. రెండు గంటల పాటు చెలగాటం ఆడి..

ABOUT THE AUTHOR

...view details