మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఈ నెల 28న(సోమవారం) ముగియనున్నాయి. పీవీ ఘనతను చాటేలా రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు, ఎంపీ కె.కేశవరావు(keshava rao) తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. తొలుత 26 అడుగుల ఎత్తయిన పీవీ కాంస్య విగ్రహాన్ని, పీవీ మార్గ్ బోర్డును వీరు ఆవిష్కరించనున్నారు. అనంతరం 11.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో 9 పుస్తకాలను విడుదల చేయనున్నారు. ఇందులో పీవీ రాసినవి 4 కాగా.. మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించేవి ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలు ఈ పుస్తకాలను ప్రచురించాయి.
ఈ నెల 28వ తేదీన పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే ఆయన జౌన్నత్యం, పాలనా దక్షత, రాజనీతి, సేవలను అందరికీ తెలిసేలా చేసేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. ఈ మేరకు గతేడాది నుంచి పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షతన ఒక కమిటీని కూడా వేసింది. పీవీ నరసింహరావు మూర్తిమత్వాన్ని 360 డిగ్రీల్లో ఆవిష్కరించేలా ఆయనపై పముద్రించిన మొత్తం 8 పుస్తకాలను కమిటీ సంగ్రహించి ప్రచురించింది.
విడుదల చేయనున్న పుస్తకాలు (సంకలనాలు)..
- పశ్చిమ దేశాలలో భారత సంస్కృతి ప్రభావంపై పీవీ ప్రసంగాలు
- గొల్ల రామవ్వ కథ, 8 అరుదైన కథలు
- పీవీ రాసిన వ్యాసాలు
- ఇంటర్వ్యూలు
- ఆర్థిక, సంస్కరణలు, పాలన రీతులపై దేశవిదేశాల అగ్ర నాయకులు రాసిన వ్యాసాలు
- అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర కార్టూనిస్టులు వేసిన క్యారికేచర్‌లు
- పీవీ నరసింహారావు జీవిత చరిత్ర
- నమస్తే పీవీ పేరిట తెలుగు పత్రికల్లో ప్రచురించిన వ్యాసాలు
- కాలాతీతుడు పేరిట 143 మంది కవులు రాసిన కవితలు
ఇదీ చూడండి:రైతులకు కూలీల కొరత... నాట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలసలు