Puvvada Ajay Kumar Fires on Central Government: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులను అదానీపరం చేస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాపిటివ్ గనులు లేకుండా చేసి మూసివేస్తున్నారని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్ ఓర్‌ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఆ గనులను బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అదానీ కోసమే 1800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రాకు తరలిస్తున్నట్లు తెలిపారు. బయ్యారంలో ఎప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. బయ్యారంలో పరిశ్రమ పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విశాఖ, బయ్యారం ఉక్కుపరిశ్రమలపై కేసీఆర్ మాట్లాడిన అంశాలపై కాంగ్రెస్, బీజేపీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీలు తెరచాటు ఒప్పందాలతో.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడటం లేదని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్ విధానం ప్రైవేటీకరణకు వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం ఉక్కు పరిశ్రమ పెట్టినట్లయితే.. సుమారు 20,000 ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమకు గనులు కేటాయిస్తే.. సదుపాయాల కోసం పెట్టుబడిలో 50శాతం భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
నవోదయ, వైద్య కళాశాలల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. అదానీకి లాభం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని ఎంపీలు మాలోత్ కవిత, వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమను సాధించుకునేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని ఎంపీలు పిలుపునిచ్చారు.