గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి దాదాపుగా కసరత్తు పూర్తైంది. ఇప్పటికే వార్డుల పునర్విభజన, వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గణన కూడా పూర్తైంది. అటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ కూడా ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు సంబంధించిన మేయర్లు, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు గతంలోనే ఖరారయ్యాయి.
ఆయా పట్టణాల్లో
రాష్ట్రం యూనిట్‌గా మేయర్, ఛైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లను పురపాలక ఎన్నికల సమయంలోనే ఖరారు చేశారు. గ్రేటర్ వరంగల్ మేయర్ బీసీ జనరల్, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ పీఠం జనరల్‌కు దక్కాయి. వాటికి అనుగుణంగానే ఆయా పట్టణాల్లో మేయర్లు, ఛైర్ పర్సన్లు ఎన్నికవుతారు.
లాటరీ విధానంలో
అప్పుడు ఎన్నికలు జరగనందున ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. ఇందుకోసం పురపాలక శాఖ ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. అందుకు అనుగుణంగా ఇవాళ వార్డుల వారీ రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటిస్తారు. పురపాలక చట్టానికి లోబడి 50 శాతానికి మించకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డులను రిజర్వ్ చేస్తారు. అన్ని కేటగిరీల్లోనూ సగం వార్డులను లాటరీ విధానంలో మహిళలకు కేటాయిస్తారు. కొత్త చట్టం ప్రకారం రెండు వరుస ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ వర్తిస్తుంది. దీంతో త్వరలో జరగబోయే ఎన్నికలతో పాటు ఐదేళ్ల అనంతరం జరిగే ఎన్నికలకు కూడా ఇవే రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి.