తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రాజకీయాలపై చర్చించిన భగవంత్‌మాన్‌, కేసీఆర్‌

Punjab CM Met CM KCR : బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతోందని తెలంగాణ, పంజాబ్‌ సీఎంలు కేసీఆర్​, భగవంత్‌మాన్‌ అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్రాల ప్రగతిని అడ్డుకోవడంతో పాటు ఆంక్షల పేరిట ఇబ్బందులు పెడుతోందని పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను తమకు అనుకూలమైన ప్రాంతాలకే కేటాయిస్తూ, ఇతర రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపుతోందని వ్యాఖ్యానించారు. రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌తో ముగిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ
సీఎం కేసీఆర్‌తో ముగిసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ

By

Published : Dec 20, 2022, 5:15 PM IST

Updated : Dec 21, 2022, 6:26 AM IST

Punjab CM met CM KCR :కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సీఎం కేసీఆర్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో పంజాబ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెట్టుబడుల సదస్సుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ హాజరయ్యారు. అనంతరం ప్రగతిభవన్‌కు వచ్చారు. కేసీఆర్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. భోజనం అనంతరం గంటసేపు ఇద్దరూ సమావేశమయ్యారు. దేశంలో రాజకీయ పరిస్థితులతో పాటు కేంద్ర ప్రభుత్వ వైఖరి... తెలంగాణ, పంజాబ్‌ రాష్ట్రాల ప్రగతి తదితర అంశాలపై చర్చించారు. కేంద్రం విధానాలతో పంజాబ్‌ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... మోదీ తెచ్చిన నూతన రైతు చట్టాలు రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపాయని భగవంత్‌ మాన్‌ ఆరోపించారు.

రైతుల నిరసనలతో ఆ చట్టాలను రద్దుచేసిన ప్రధాని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేశారని తెలిపారు. ఎఫ్​ఆర్​బీఎమ్​ నిబంధనలు మార్చి రాష్ట్రాలు అప్పులు తీసుకోకుండా కేంద్రం అడ్డుకోవడం దారుణమని.. భాజపా విధానాలను ఆప్‌ అడ్డుకునేందుకు కృషి చేస్తోందన్నారు. పంజాబ్‌ ప్రభుత్వపరంగా కేంద్రం విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని, భాజపాయేతర పార్టీల ప్రభుత్వాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు.

రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన జరిగాక ప్రధాని మోదీ తెలంగాణ ఏర్పాటును విమర్శించారని.. రాష్ట్రంపై ఆది నుంచి వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు. విభజన హామీలను నెరవేర్చలేదని.. తెలంగాణలో పెట్టాల్సిన ప్రాజెక్టులను భాజపా పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు పన్నుల రూపేణా రావాల్సిన వాటాను కుదించేందుకు సెస్సులను తెరపైకి తెచ్చారని తెలిపారు. రాష్ట్రాల అప్పులపై కేంద్రం వైఖరి హేయమైనదని... రాష్ట్రంలో పండిన ధాన్యం కొనుగోలుకు కొర్రీలు పెట్టిందని... భాజపా వైఖరితో దేశం తిరోగమన దిశలో వెళ్తోందని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

దిల్లీ మద్యం కేసు కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమేనని.. అక్కడి ఆప్‌ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఆ కేసులో కేంద్రానికి భంగపాటు తప్పదన్న కేసీఆర్​ విపక్ష ప్రభుత్వాలను పడగొట్టేందుకు, ఇబ్బందులు పెట్టేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కేంద్రం విధానాలపై జాతీయ స్థాయిలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భారత్‌ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్‌కు భగవంత్‌ మాన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ చేపట్టిన రైతు విధానాలు దేశానికే ఆదర్శమన్నారు. పెట్టుబడుల సదస్సులో తెలంగాణ పారిశ్రామిక విధానాలను పారిశ్రామికవేత్తలు ప్రశంసించారని చెప్పారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన అన్నదాతలకు సాయంపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పారిశ్రామిక, రైతు విధానాలపై అధ్యయనానికి త్వరలో తమ అధికారుల బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని చెప్పారు. చర్చల అనంతరం పంజాబ్‌ సీఎం మాన్‌కు.. కేసీఆర్‌ శాలువా కప్పి, జ్ఞాపిక బహూకరించారు. టీఎస్‌ ఐ-పాస్‌, టీ-హబ్‌, వీ-హబ్‌లకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 6:26 AM IST

ABOUT THE AUTHOR

...view details