శ్వాససమస్యలు రాకుండా ఉండటానికి ఎక్కువ మంది ఆవిరి పడుతున్నారు. దీనివల్ల ప్రయోజనాలున్నాయా?
రోజులో నాలుగయిదు సార్లు ఆవిరిపట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ముక్కులో వైరస్‌ను అడ్డుకోవటానికి రోమాలుంటాయి. ఎక్కువ ఆవిరి పట్టడం వల్ల అవి దెబ్బతింటాయి. ముక్కులో ఉండే సహజమైన వాతావరణాన్ని మార్చటం వల్ల వైరస్‌లు, ఫంగస్‌లు లోపలికి చొచ్చుకుపోతాయి.
ఫంగస్ వ్యాధులు పెరగటానికి కారణమేమిటి?
సాధారణంగా మన శరీరంలో ఫంగస్ ఎప్పుడూ ఉంటుంది. రోగనిరోధకశక్తి దెబ్బతినటం వల్ల అది తన ప్రతాపాన్ని చూపుతుంది. కొవిడ్ వచ్చిపోయింది ఫరవాలేదు అని మాస్క్ పెట్టుకోకుండా తిరగటం వల్ల ఫంగస్ లోపలకు ప్రవేశిస్తోంది.
చికిత్స పొంది కోలుకున్న తర్వాత కూడా కొద్ది మందిలో మళ్లీ పాజిటివ్ వస్తోంది ఎందుకు?
కొందరి శరీరంలో మృత వైరస్ అలా ఉండిపోతుంది. దీనివల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కరోనా వచ్చి తగ్గాక మూడునెలల సమయాన్ని పోస్ట్ కొవిడ్‌గా పరిగణిస్తారు. ఈ వ్యవధిలోనే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ దాదాపు 5 నుంచి 10 శాతం మంది ఇలా వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ఈ సమయం ఏడాది వరకూ ఉండొచ్చు. దీనిని లాంగ్ పోస్ట్ కొవిడ్‌గా వ్యవహరిస్తారు.