Gopichand Started New Badminton Academy: హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో.. సరికొత్త ప్రపంచ స్థాయి 'కోటక్ పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ' ప్రారంభించారు. కోటక్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ సరికొత్త అకాడమీ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కోటక్ మహీంద్ర బ్యాంకు ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అత్యాధునిక వసతులు, ఎయిర్ కండిషన్ బ్యాడ్మింటన్ కోర్టులతో అత్యుత్తమ శిక్షణా కేంద్రంగా నిలుస్తుందని క్రీడాకారులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ సౌకర్యాలతో అకాడమీ: భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాళ్ల కోసం 2019లో కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రపంచ స్థాయి శిక్షణా సౌకర్యాన్ని అభివృద్ధి చేసేందుకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యమైంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ సహకారంతో.. గోపీచంద్ అకాడమీలో సరికొత్త బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించారు. దేశంలో ఉన్న క్రీడాకారులను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ సరికొత్త శిక్షణా సౌకర్యాన్ని ప్రారంభించినట్లు పుల్లెల గోపీచంద్ తెలిపారు. అంతర్జాతీయ విలువలను తలపించేలా కోచింగ్ సౌకర్యాలను అందిస్తూ.. క్రీడాకారులకు నాణ్యతతో కూడిన శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కోటక్‌తో కలిసి ఈ సరికొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.