Bank Strike: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు తలపెట్టిన సమ్మె తొలిరోజు రాష్ట్రంలోనూ విజయవంతంగా సాగింది. ప్రభుత్వరంగ, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. తెలుగురాష్ట్రాల్లో దాదాపు 70వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు బ్యాంకు యూనియన్ నాయకులు చెప్పారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో.... కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవరణలో మహా ధర్నా నిర్వహించారు.
పలు జిల్లా కేంద్రాల్లో నిరసన గళం
Bank Strike today: హనుమకొండలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉద్యోగులు నిరసనకు దిగారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో పేద, మధ్యతరగతి వారికి సేవలు దూరమవుతాయని కరీంనగర్‌లో నిరసన తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని ఖమ్మంలో ఆందోళన చేశారు. నిజామాబాద్‌లో స్టేట్ బ్యాంకు ముందు దీక్ష చేశారు. ఆదిలాబాద్‌లోనూ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో జరిగే నష్టాలను వివరిస్తూ మంచిర్యాలలో ర్యాలీ చేశారు. మహబూబాబాద్‌లో పట్టణ వీధుల్లో ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. లాభాల బాటలో పయనిస్తున్న బ్యాంకులను ప్రైవేటుపరం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.
సమ్మెకు సంఘీభావం
Bank Strike against to privatization: హైదరాబాద్‌లో ఉద్యోగుల నిరసనకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, తదితరులు సంఘీభావం తెలిపారు. సమ్మెకు సర్కారు మద్దతు ఉంటుందని వినోద్‌కుమార్ భరోసా ఇచ్చారు. బ్యాంకుల ప్రైవేటీకరణతో పేదల సొమ్మంతా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం కుట్ర చేస్తోందని వినోద్ కుమార్ విమర్శించారు.
కేవలం జాతీయ బ్యాంకుల వల్లే..
ఇవాళ భారతదేశం ఇంత గొప్పగా, ఆర్థికంగా నిలబడ్డదంటే కేవలం జాతీయ బ్యాంకుల వల్లేనని గర్వంగా చెప్పదలచుకున్నాను.ఇంకా జాతీయీకరణ చేయాల్సిన బ్యాంకులను.. ఇవాళ అంబానీ, అదానీలకు అమ్మడానికి సిద్ధంగా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంపై సవరణ బిల్లును ప్రవేశపెడితే అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకుని స్టాండింగ్ కమిటీలో చర్చించొచ్చు. ఆ విధంగా చర్చించడానికి సిద్ధంగా లేరు.