కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరుగా ఉన్నా ప్రజలు మాత్రం జాగ్రత్తలు పాటించడంలేదు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కొవిడ్ నియమాలను నామమాత్రంగా పాటిస్తున్నారు. థియేటర్ల సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నా కొందరు ప్రేక్షకులు దురుసుగా వ్యవహరిస్తున్నారు. హాల్ లోపలికి వెళ్లిన అనంతరం ప్రేక్షకులు మాస్కులు తీసి పక్కన పెడుతున్నారు. ఈ విషయంపై హెచ్చరించినా తిరిగి తమనే అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని సిబ్బంది ఆరోపించారు.
కరోనా కలవరం..
100 శాతం సీటింగ్కు అవకాశం ఇవ్వడంతో ప్రేక్షకులు ఏ మాత్రం జాగ్రత్తలు పాటించడం లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భౌతిక దూరంతో అనుమతి ఇచ్చినప్పటికీ థియేటర్లో మాత్రం పక్కపక్కనే కూర్చోవడం అందరినీ తీవ్రంగా కలవరానికి గురిచేస్తోంది. మాస్కు ధరించాలనే నిబంధనతో ప్రభుత్వం 100 శాతం సీటింగ్ అవకాశం కల్పించిందని నిర్వాహకులు వివరించారు.
కానీ తమ థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు మాస్కు ధరించి వస్తున్నారని, మార్పు కనిపిస్తోందని సుదర్శన్, దేవి థియేటర్ల యజమాని తెలిపారు. మాస్కు ధరించి సినిమాకు రావాలనే నిబంధనలను తాము కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:నిర్లక్ష్యం... థియేటర్లలో కనిపించని కరోనా నిబంధనలు