Minors Entry into Pubs: మెట్రో పాటిటన్ నగరాల్లో పార్టీల సంస్కృతి కొత్తేం కాదు. ఒకప్పుడు సంపన్న కుటుంబాలకే పరిమితమైన విందు, వినోదాలు.. ఈ మధ్య కాలంలో మధ్య తరగతి యువతకూ అలవాటయ్యాయి. ఉద్యోగం, వ్యాపారంలో వచ్చే మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు మత్తు పదార్థాలను ఆశ్రయిస్తున్నారు. సిగరెట్, మద్యం లాంటి వాటికి దగ్గరవుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతకు మంచి ఆనందాన్ని ఆస్వాదించేందుకు అమ్మాయిలను జతగా చేసుకుంటున్నారు.
అయితే ఎంజాయ్ అనే ముసుగులో కొన్ని దారుణాలు జరుగుతున్నాయి. మైనర్లను పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా... కొందరు నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. పలు మార్లు కేసులు నమోదు చేసినా పరిస్థితిలో మార్పు లేదు. బాల బాలికలకు అనుమతినిస్తున్నారు. దీనికి తోడు పుట్టినరోజు వేడుకలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో రాయితీ ఇచ్చి ప్రోత్సహించటం విశేషం.
గతేడాది జూబ్లీహిల్స్లో పబ్ వద్ద మైనర్లపై జరిగిన సామూహిక అత్యాచారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాదాపూర్లోని ఒక పబ్లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, డీజే ఈవెంట్ నిర్వాహకుడు ప్రయివేటు పార్టీలను ఏర్పాటు చేసి యువతకు మత్తు పదార్థాలు అలవాటయ్యేలా చేస్తున్నాడు. అంతర్జాతీయ డీజేలతో సంబంధాలున్న మోహిత్ అగర్వాల్ అలియాస్ మైదాన్ మోహిత్ ఏర్పాటు చేసే ఈవెంట్ కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.
నగరంలోని పలు పబ్బులు, ఫామ్ హౌస్లు, రిసార్టుల్లో వారాంతాల్లో నిర్వహించే పార్టీల్లో ఒంటరిగా వెళ్లే అబ్బాయిలకు అక్కడే నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. శని, ఆదివారాల్లో సుమారు 10 నుంచి 20 మంది యువతులను ఒక పబ్బు నిర్వాహకులే రోజుకు రూ.2000- రూ.5000 కమీషన్ ఇచ్చి అబ్బాయిలను ఆకట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలున్నాయి.