భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి రోదసీలోకి ఒకేసారి 14 ఉపగ్రహాల్ని పంపేందుకు రంగం సిద్ధం చేసింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక ఇందుకు సిద్ధమైంది. చంద్రయాన్-2 తర్వాత ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగమిది.
సోమవారం ఉదయం పది గంటలకు రిహార్సల్‌ను విజయవంతంగా ముగించారు. అనంతరం ఆబార్డ్ టెస్టు నిర్వహించారు. ఇవాళ ఉదయం 7.28 గంటలకు ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 26 గంటలపాటు నిరంతరాయంగా కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పీఎస్‌ఎల్‌వీ-సి47 వాహకనౌక బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. అనంతరం 26.50 నిమిషాల వ్యవధిలో 14 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. మన దేశానికి చెందిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని రాకెట్ బయలుదేరిన 17.42 నిమిషాలకు 515 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలో వదులుతుంది. ఆ తరువాత అమెరికాకు చెందిన ఉపగ్రహాల్ని కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.